ఫిర్యాదుదారుడిగా వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి!

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి జరిగింది. ఆమె నివాసంలో ఈ ఉదయం ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Published on: Aug 20, 2025 10:15 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ఈ ఉదయం తన నివాసంలో దాడి జరిగింది. తన నివాసంలో జరిగిన 'జాన్ సున్‌వాయ్' కార్యక్రమానికి హాజరైన ఒక వ్యక్తి ఆమె మీద దాడి చేశాడు. ఫిర్యాదుదారుడి వేషంలో వచ్చి దాడి చేశాడు. జాన్ సున్‌వాయ్ కార్యక్రమం అనేది పౌరుల ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడానికి ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఒక చొరవ.

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి

ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వెంటనే దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. కార్యక్రమానికి ఫిర్యాదుదారుడిలా వేషంలో వచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు. దాడి తర్వాత వెంటనే ముఖ్యమంత్రిని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఆమె నివాసానికి చేరుకుని భద్రతను పెంచారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యమంత్రి ప్రతి వారం తన నివాసంలో జరిగే జన్ సున్‌వాయ్ సమావేశానికి హాజరవుతారు.

30 సంవత్సరాల వయసున్న వ్యక్తి మెుదట సీఎం దగ్గరకు వచ్చాడు. కొన్ని పేపర్లను చూపించాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో చేస్తున్న పనిని ప్రత్యర్థులు సహించలేకపోతున్నారని, దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు. ఈ దాడిని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ఖండించారు.

బీజేపీ సీనియర్ నాయకుడు హరీష్ ఖురానా మాట్లాడుతూ..'సమావేశంలో ఉన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రిపై దాడి చేశాడు. ప్రస్తుతం వైద్యులు ముఖ్యమంత్రిని పరీక్షిస్తున్నారు. మేం దాడిని ఖండిస్తున్నాం. ఈ దాడి రాజకీయంగా ప్రేరేపించబడిందా అని దర్యాప్తు చేయాలి.' అని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు అతిషి ఈ దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని అన్నారు. 'ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించదగినది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, నిరసనలకు చోటు ఉంటుంది. కానీ హింసకు చోటు లేదు. ఢిల్లీ పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాం.' అని అతిషి అన్నారు.

భద్రతా ఉల్లంఘనకు దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి విచారణ నిర్వహించనున్నట్టుగా ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్‌బీకే సింగ్ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తారు.

News/News/ఫిర్యాదుదారుడిగా వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి!
News/News/ఫిర్యాదుదారుడిగా వచ్చి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి!