Subscribe Now! Get features like
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. ఈ రెండేళ్ల పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉంది? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ఓటరు మనసులో ఏముందో తెలుసుకోవడానికి నెల రోజుల పాటు(25 సెప్టెంబర్ నుండి 25 అక్టోబర్ వరకు) తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి పీపుల్స్ పల్స్ సంస్థ మూడ్ సర్వే నిర్వహించింది.

తెలంగాణ ప్రభుత్వం ఈ రెండేళ్లలో వ్యవసాయ, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో తీసుకున్న విధానాలు ఏంటి? హామీ ఇచ్చినట్టుగా ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా? యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయా? ఈ రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఎంతవరకు ప్రజల మన్ననలు పొందాయి? తదితర అంశాలను క్లుప్తంగా అధ్యాయనం చేయడానికి పీపుల్స్ పల్స్ రీసర్చ్ బృందం ఈ మూడ్ సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి, సేకరించిన సమాచారానికి అనుగుణంగా ఈ నివేదికను రూపొందించింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రస్తావిస్తూ... పీపుల్స్ పల్స్ బృందం క్షేత్రస్థాయిలో ప్రజలతో మాటమంతి జరిపినప్పుడు ఎక్కడికి వెళ్లినా అధికశాతం మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలి?’’ అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొచ్చినా... దాని నుంచి రాజకీయ లబ్ది పొందలేకపోయిందనే చెప్పాలి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తీసుకువచ్చినా... బస్సు సర్వీసులు తగ్గించడం, ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన కారణంగా ప్రభుత్వం పట్ల మహిళలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఆటో డ్రైవర్లు తమకు హామీ ఇచ్చిన రూ.12,000 ఆర్థిక సాయం ఇవ్వలేదని, ఉచిత బస్సు తమ ఉపాధిని దెబ్బతీసిందనే ఆందోళనలో ఉన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ ఆదాయం బాగా తగ్గిందని కరీంనగర్ లో రమేశ్ అనే ఆటో డ్రైవర్ చెప్పారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఆటో మీద ఆధారపడిన కుటుంబాలు ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నాయి.
రైతులకు రుణమాఫీ విషయంలో తొలుత కొంచెం మైలేజీ వచ్చినట్టే వచ్చినా... అనేక నిబంధనల కారణంగా లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఫలాలు అందలేదు. రైతు భరోసా పథకం కూడా అరకొరగా అందుతోందని, మధ్యలో ఒక పంటకు ఇవ్వలేదని రైతులు చెప్తున్నారు. దీంతో రైతులు కూడా ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ‘‘యూరియా కొరత వల్ల పంటలు దెబ్బతిన్నాయి. చాలా నష్టపోయాం. రుణమాఫీ, రైతు భరోసా పక్కనపెడితే సమయానికి యూరియా అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసింది. కేసీఆర్ కాలంలో ఇలాంటి సమస్యలు లేవు ఉండేవి కావు’’ అని ఉమ్మడి ఆదిలాబాద్ బోథ్ లో కలిసిన రాజేశ్ అనే యువ రైతు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఇదే వరుసలో మాట్లాడటం గమనార్హం.
పండుగ పూట పీపుల్స్ పల్స్ బృందం పర్యటించడం వల్ల చాలాచోట్ల మహిళలు బతుకమ్మ చీరల ప్రస్తావన తీసుకొచ్చారు. ‘‘బతుకమ్మ చీరలు రెండో ఏడు కూడా ఇవ్వలేదు. గ్యాస్ సబ్సిడీ కూడా రావడం లేదు. మహిళలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని కామారెడ్డిలో లక్ష్మీ అనే మహిళ చెప్పింది. గ్యాస్ సబ్సిడీ రూ.500 క్రెడిట్ కావడం లేదని, మహిళలు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపట్ల ప్రభుత్వం కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న హామీ గురించి మాట్లాడినప్పుడు... ఆదిలాబాద్ నుంచి మహబుబ్ నగర్ వరకు మహిళలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఇంకెప్పుడు ఇస్తారు? అనే ధోరణిలో ప్రశ్నిస్తున్నారు. దీనికి ఇటీవల బీఆర్‌ఎస్ ప్రచారంలోకి తీసుకొచ్చిన ‘బాకీ కార్డు’ కొంత వరకు పని చేసింది. ప్రజలు బాకీ కార్డులోని అంశాలను ప్రస్తావించడాన్ని పీపుల్స్ పల్స్ రికార్డు చేసింది. కానీ, దీనిని కేవలం సోషల్ మీడియాకే పరిమితం చేసి… ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లడంలో బీఆర్‌ఎస్ విఫలమైంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పీపుల్స్ పల్స్ మాట్లాడినప్పుడు…. ‘‘రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. ఇన్వెస్ట్‌మెంట్లు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని చెప్పారు. హైడ్రా భయం వల్ల రియల్ ఎస్టేట్ విక్రయాలు ఆగిపోయాయని, కనీసం స్టడీ చేయకుండా సీఎం హైడ్రాను తీసుకొచ్చారని పేరు చెప్పడానికి ఇష్టపడని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోయారు. రియల్ ఎస్టేట్ కుంటుపడటం వల్ల దాని అనుబంధ రంగాలు కూడా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సరైన పెట్టుబడులు రాక... ప్రయివేట్ రంగంలో, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు నెమ్మదించాయని, కోచింగ్ సెంటర్ల దగ్గర నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు తెలిసింది.
ఇక కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నినాదం గురించి హైదరాబాద్ లో నాయకుల మధ్య తప్ప.. క్షేత్రస్థాయిలో ఎక్కడా దీని గురించి చర్చ లేదు. వీటికి తోడు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ వివాదాల్లో ఉండటం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారింది. ‘‘జిల్లా అభివృద్ధిని పట్టించుకోకుండా, యూరియా కొరత, విద్యుత్ సమస్యలను పట్టించుకోకుండా మంత్రులు గొడవలు పెట్టుకోవడం ఏంటో?’’ అని హన్మకొండలో కలిసిన శ్రీనివాస్ అనే రైతు పెదవి విరిచారు. బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేస్తున్నారని బస్తీల్లో నివసిస్తున్న ప్రజలు వాపోతున్నారు.‘‘డ్రైనేజీలు పొంగుతున్నాయి. కనీసం దోమల మందు కొట్టే దిక్కు లేదు’’ అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ లో కలిసి అజీం అబ్దుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా కొంత సానుకూలత తెచ్చాయి. కానీ, అదే సమయంలో యూరియా కొరత వల్ల పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళనలు చేయడంతో ఆ పథకాలు తెచ్చిన సానుకూలత కనుమరుగయింది. రచ్చబండల దగ్గర నాడు-నేడు చర్చలు జోరుగా సాగుతున్నాయి. అన్ని వర్గాల్లో అధికశాతం మంది ఏక కంఠంతో కేసీఆర్ పాలనే బాగుందని చెప్తున్నారు. పదిలో 8 మంది కేసీఆర్ పాలనే బాగుందని చెప్పారు. ‘‘చేనేత వృత్తి దెబ్బతిన్నది. మాకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదు.’’ అని సిరిసిల్లలో చేనేత కార్మికులు చెప్పారు. పోచంపల్లిలోనూ ఇవే మాటలు వినపడ్డాయి.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికీ బీఆర్‌ఎస్సే కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ రెండో స్థానానికి వస్తుందని భావించినా పరిస్థితి మెరుగుపడలేదు. కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే బీజేపీ చర్చ ఉంది. రాంచందర్ రావు అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. తమకు సరైన దశా దిశా చేసే నాయకుడు లేకుండా పోయాడని బీజేపీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎన్ని తగదాలు ఉన్నాయో... బీజేపీలో కూడా అన్ని తగడాలు ఉన్నాయి. దీంతో బీజేపీ జిల్లా శాఖలు కూడా అయోమయంలో పడ్డాయి. ఇక, కమ్యూనిస్టులు నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యారు. కానీ, వాళ్ల ఉనికి ఉన్నట్టుగా కూడా ఎక్కడా కనిపించడం లేదు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ మోసాలను ప్రశ్నించడం లేదనే భావన కూడా ప్రజల్లో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే కమ్యూనిస్టులను నల్లగొండ, ఖమ్మంలో కూడా మరచిపోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త పార్టీలు పెట్టుకున్న కేసీఆర్ కూతురు కవిత, తీన్మార్ మల్లన్న పార్టీల ప్రభావం నామామత్రంగానే ఉంది. కమ్యూనిస్టులతో పాటు ఈ పార్టీలు కూడా లెటర్ హెడ్ ఆర్గనైజేషన్స్ గానే మిగిలిపోయాయి.
ఇతర పార్టీల బలహీనతలు బీఆర్‌ఎస్ కి కలిసి వస్తున్నాయి. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీఆర్‌ఎస్ కి ఓటు వేస్తామని ఇంకో దిక్కు లేక బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్టుగానే ప్రజలు జవాబులిస్తున్నారు. కేసీఆర్ మీద సానుకూలత ఉన్నప్పటికీ... బీఆర్‌ఎస్ పార్టీ పనితీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం మూడు ప్రెస్ కాన్ఫరెన్స్ లు, ఆరు ట్వీట్ లు అన్నట్టుగా బీఆర్‌ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైందని, కాంగ్రెస్ వైఫాల్యాలను ఎత్తి చూపడంలో క్షేత్రస్థాయి ప్రతిపక్ష పాత్రను విస్మరిస్తోందనే విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వినపడ్డాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడంబరాలు, మీడియా మేనేజ్‌మెంట్‌తో సరిపెట్టుకుంటోందని పాలమూరు యూనివర్సిటీని సందర్శించినప్పుడు అక్కడ పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రొఫెసర్ చెప్పారు. అధికారులకు జవాబుదారీతనం లేదని, ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల వ్యతిరేకత పెరుగుతోందని, ప్రతి జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, వీరిపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ఇంకా ఉధృతంగా నిరసనలు చేయాలని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. ఏడాదిలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నా... కొత్త ఉద్యోగాలు ఇచ్చిందే లేదని, కాంగ్రెస్ వి అన్ని ఉత్త మాటలే అని ప్రొఫెసర్ పక్కనే నిలబడిన సురేశ్ అనే పీజీ విద్యార్థి అన్నారు.
పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ చేసిన ఈ మూడ్ సర్వేను జాగ్రత్తగా డికోడ్ చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా బద్నాం అయ్యిందని తెలిసిపోతుంది. సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డు పథకాలు కొంత సానుకూలత తెచ్చినా….. వారు ఇచ్చిన వందలాది వాగ్దానాలు అమలు కాలేదు. ఇందుకే, ప్రజలు గత బీఆర్‌ఎస్ పాలనకు, ఇప్పటి కాంగ్రెస్ పాలనకు పోలిక తీసుకొస్తూ కేసీఆర్ ని మెచ్చుకుంటున్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...ఎవరికి ఓటేస్తారని అనడిగినప్పుడు.. కాంగ్రెస్‌కు ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. అసంతృప్తి, వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది తెలంగాణ ప్రజల మూడ్‌ను ప్రతిబింబిస్తుంది. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికలు సరిగ్గా జరిగితే 31 జిల్లా పరిషత్‌లలో 20 బీఆర్‌ఎస్, కాంగ్రెస్ 10, బీజేపీ 1-2 సీట్లు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే అంచనా వేసింది.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తమ తప్పులను తెలుసుకుని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పని చేయాలి. లేదంటే ప్రజల్లో ఈ అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరు గ్యారెంటీల అమలు మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బీఆర్‌ఎస్ కూడా తాము పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర పట్ల ఆత్మపరిశీలన చేసుకోవాలి.
సోషల్ మీడియా, మీడియాను దాటి క్షేత్రస్థాయిలో కోల్పోయిన ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలి. గత బీఆర్‌ఎస్ పాలనలోని లోపాలు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోని లోపాలు ఎత్తిచూపి, ముందుకు వెళ్లే అవకాశం ఉన్న బీజేపీ సుప్తచేతనావస్త నుంచి బయటకు రావాలి. ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే, వచ్చే మూడేళ్లలో ప్రతి రోజూ యుద్ధం కొనసాగించాలి. అంటే, తెలంగాణ ప్రజల మనసును అర్థం చేసుకునేవారికే భవిష్యత్తు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు….!

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు, వ్యూహాలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్ (హెచ్‌టీ)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు)







