హిడ్మా డైరీలో కీలక విషయాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్టులు!

విజయవాడ, కాకినాడతోపాటుగా మరికొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను పోలీసులు గుర్తించారు. తాజాగా పలు ప్రాంతాల్లో మావోలను అదుపులోకి తీసుకున్నారు.

Updated on: Nov 18, 2025, 14:22:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓ వైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లాతోపాటుగా విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో మావోల కదలికలను గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఉన్నారేమో అనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

విజయవాడలో మావోయిస్టులు ఉన్నారనే విషయం తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే కూలీలుగా చెప్పుకొని వారు అద్దెకు ఉంటున్నట్టుగా తెలిసింది. పెనమలూరులో భవనం అద్దెకు తీసుకున్నారని సమాచారం. షెల్టర్ జోన్‌గా మార్చుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా అడవుల్లో ఉన్న మావోయిస్టులపై బలగాలు దాడి చేస్తున్నాయి. దీంతో సిటీలో ఉంటూ మావోలు సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు కానూరు కొత్త ఆటోనగర్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్‌లో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్టుగా అధికారులకు సమచారాం వచ్చింది. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లుగా పోలీసులకు తెలిసింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేయడాన్ని గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో ఓ ఇంట్లో 27 మంది అద్దెకు ఉంటున్నారు. వారిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. అయితే మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్ దగ్గర హిడ్మా డైరీ దొరికిందని అందులో ఉన్న సమాచారం ఆధారంగానే సెర్చ్ ఆపరేషన్ జరిగిందని అంటున్నారు. ఇందులో పలు కీలక విషయాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. డైరీలో షెల్టర్ల గురించిన సమాచారం రాసుకున్నారా? లేదంటే ఎలాంటి విషయాలు ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది.

కృష్ణా జిల్లాతోపాటుగా విజయవాడ, కాకినాడ, ఏలూరులో మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో మెుత్తం 32 మంది, కాకినాడలో ఇద్దరు, ఏలూరులో 15 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతుందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఏకే 47, పిస్టల్, రివాల్వర్, సింగిల్ బోర్ వెపన్, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్ బండిల్, కెమెరా ఫ్లాష్ లైట్, కటింగ్ బ్లేడ్ , ఫ్యూజ్ వైర్, కిట్ బ్యాగులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను సీక్రెట్ ప్లేస్‌కి తరలించారు. వారికి ఓ మహిళ షెల్టర్ ఇస్తున్నట్టుగా గుర్తించారు.

మంగళవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఇందులో హిడ్మా భార్య రాజక్క కూడా ఉన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More