గణేష్ చతుర్థి వేడుకలకు దూరంగా ఓ గ్రామం.. కారణం ఏంటో తెలుసా?

దాదాపు ప్రతీ గ్రామం వినాయక చవితి వేడుకలతో అంగరంగ వైభవంగా ఉంది. అయితే ఓ గ్రామం మాత్రం ఈ ఉత్సవాలకు దూరంగా ఉంది. కారణం ఏంటో తెలుసుకోండి.

Updated on: Sep 14, 2026, 14:10:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశమంతటా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నప్పటికీ, అనంతపురం జిల్లాలోని ఒక గ్రామం ఈ ఉత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బసంపల్లి మండలం శెట్టూరు గ్రామ ప్రజలు వినాయక చవితి వేడుకలను నిర్వహించకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

గణేష్ చతుర్థి ఉత్సవాలు
గణేష్ చతుర్థి ఉత్సవాలు

శెట్టూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన మారెమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం అవుతాయి. గణేష్ చతుర్థి సోమవారం. సాధారణంగా ఈ గ్రామ దేవత జాతర వినాయక చవితి పండుగకు ఒకటి లేదా రెండు రోజులు అటు ఇటుగా ఉంటుంది. ఈ సంవత్సరం మారెమ్మ ఉత్సవాలు.. గణేష్ చతుర్థి తర్వాతి రోజున ఉన్నాయి.

గ్రామ ఆచారం ప్రకారం మారెమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా గ్రామస్థులు, భక్తులు సాంప్రదాయబద్ధంగా మాంసాహార నైవేద్యాలను సమర్పిస్తారు. ఒకవైపు మారెమ్మ జాతరలో మాంసాహార వంటకాలు సిద్ధం చేస్తుండగా, మరొకవైపు అత్యంత నియమనిష్ఠలతో నిర్వహించే వినాయక చతుర్థి పూజలు చేయడం సమంజసం కాదని ఊరి పెద్దలు, గ్రామస్థులు భావించారు.

గ్రామ దేవత జాతర జరుగుతుండగా.. వినాయక మండపాలు ఏర్పాటు చేసి పూజలు జరపడం శాస్త్రోక్తంగా సరికాదని స్థానికులు విశ్వసించారు. అందువల్ల గణేష్ ఉత్సవాల నుండి దూరంగా ఉండి, గ్రామమంతా కలిసికట్టుగా మారెమ్మ అమ్మవారి సేవలోనే పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. చాలా ఏళ్ల నుంచి ఈ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలకు దూరంగానే ఉంటున్నారు. మారెమ్మ ఉత్సవాల సందర్భంగా ఇంట్లో బంధువులు ఉంటారు. నాన్ వెజ్ వంటకాలు ఉంటాయి.

రెండు పండుగల ఆధ్యాత్మిక నియమాలకు భంగం వాటిల్లకుండా, గ్రామ సంప్రదాయాలను గౌరవిస్తూ స్థానికులు తీసుకున్న ఈ నిర్ణయం చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా ఉంది. భక్తితో పాటు గ్రామ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలంతా ఐక్యంగా ఉంటున్నారు. దాదాపు ప్రతీ ఇంట్లో మాంసాహారం వండుతారు కాబట్టి.. వినాయకుడు అపవిత్రం కాకూడదనే ఉద్దేశంతో చాలా ఏళ్లుగా గణేష్ చతుర్థిని నిర్వహించడం లేదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More