IPS N Sanjay Suspension Extended : సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ సస్పెన్షన్‌ను మరింత కాలం పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనపై ఉన్న నేరపూరిత విచారణ ముగిసే వరకు లేదా వచ్చే ఏడాది ఆయన ఉద్యోగ విరమణ (రిటైర్మెంట్) పొందే వరకు…అంటే ఈ రెండింటిలో ఏది ముందయితే అంతవరకు సస్పెన్షన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది.

1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్‌పై తీవ్రస్థాయిలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు రావడంతో 2024 డిసెంబర్‌లో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన సమయంలో 'అగ్ని ఎన్‌వోసీ' వెబ్ పోర్టల్ అభివృద్ధి, నిర్వహణ పనుల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయనపై ప్రధాన ఆరోపణ ఉంది.
సీఐడీ నిధుల మళ్లింపు ఆరోపణలు
దీంతో పాటు సీఐడీలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్న సమయంలో కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ బాధితుల హక్కులు, అట్రాసిటీ నిరోధక చట్టం-1989 నిబంధనలపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు కేటాయించిన నిధులను సైతం ఆయన దుర్వినియోగం చేశారని విచారణ సంస్థలు గుర్తించాయి.
"ఈ సమయంలో సంజయ్ సస్పెన్షన్‌ను రద్దు చేస్తే, ఆయన తన అధికారాన్ని ఉపయోగించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా విచారణ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని రివ్యూ కమిటీ భావించింది," అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు.
2024 డిసెంబర్ 24న అసిస్టెంట్ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) నమోదు చేసిన కేసు విచారణ దశలోనే ఉందని కమిటీ గమనించింది. ఈ కేసులో ఇంకా కొందరు కీలక సాక్షులను విచారించాల్సి ఉందని…. విచారణకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను సేకరించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, వివాదాస్పద పత్రాలకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL) నివేదికలు కూడా ఇంకా రావాల్సి ఉంది.
సంజయ్‌పై నేరపూరిత విచారణ పెండింగ్‌లో ఉన్నందున, ఆయనపై వచ్చిన ఆరోపణలు ఆయన నిర్వహించిన పదవితో ముడిపడి ఉన్నందున అఖిల భారత సేవల (ఆల్ ఇండియా సర్వీసెస్) నిబంధనలు 1969లోని రూల్ 3 ప్రకారం సస్పెన్షన్‌ను పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
{{/usCountry}}సంజయ్‌పై నేరపూరిత విచారణ పెండింగ్‌లో ఉన్నందున, ఆయనపై వచ్చిన ఆరోపణలు ఆయన నిర్వహించిన పదవితో ముడిపడి ఉన్నందున అఖిల భారత సేవల (ఆల్ ఇండియా సర్వీసెస్) నిబంధనలు 1969లోని రూల్ 3 ప్రకారం సస్పెన్షన్‌ను పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
{{/usCountry}}నవంబర్ 6న సంజయ్ సస్పెన్షన్‌ను సమీక్షించిన కమిటీ…. నేరపూరిత విచారణ పూర్తయ్యే వరకు లేదా 2027 మార్చి 31 వరకు (ఏది ముందయితే అది) ఆయనను సస్పెన్షన్‌లోనే ఉంచాలని సిఫార్సు చేసింది.
సంజయ్‌కి గతంలోనే చార్జిమెమో జారీ చేసినప్పటికీ…. నిర్ణీత గడువులోగా ఆయన తన లిఖితపూర్వక వివరణను సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో ఆయనపై శాఖాపరమైన విచారణ జరిపేందుకు ప్రభుత్వం విచారణాధికారిని, ప్రజెంటింగ్ ఆఫీసర్‌ను నియమించింది.