...
...
Next Story

రాప్తాడు స్కూల్ ఘటన : నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం - కర్నూల్ ఆస్పత్రికి తరలింపు

రాప్తాడు పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ అలియాస్ దుమ్ము ఆరోగ్యం విషమించింది. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో (పల్మనరీ ఎంబాలిజం) పోలీసులు అతడిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు.

Published on: Nov 15, 2026, 10:59:57 IST
Advertisement

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపం (చైన్‌సా)తో దాడికి పాల్పడిన కేసులో నిందితుడు హేమంత్ అలియాస్ దుమ్ము (21) ఆరోగ్య పరిస్థితి విషమించింది. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం క్షీణించడంతో…. పోలీసులు శుక్రవారం రాత్రి కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)కి తరలించారు. ఈ వివరాలను పోలీసు అధికారులు శనివారం వెల్లడించారు.

రక్తం గడ్డకట్టడంతో ప్రాణాపాయం

హేమంత్ పరిస్థితి విషమం ( (HT/PTI))
హేమంత్ పరిస్థితి విషమం ( (HT/PTI))

నవంబర్ 9వ తేదీ రాత్రి ఆస్పత్రిలో మంచం మీద నుంచి కింద పడిన తర్వాత హేమంత్ ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అతడికి పలు వైద్య పరీక్షలు నిర్వహించి 'పల్మనరీ ఎంబాలిజం' (ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డకట్టడం) ఉన్నట్లు నిర్ధారించారు. ఇది ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన వ్యాధి.

హేమంత్ ఆరోగ్య స్థితిపై అనంతపురం వైద్య బృందం శుక్రవారం రాష్ట్ర హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. "రక్తనాళాల్లో ఏర్పడిన ఈ గడ్డలకు తక్షణమే చికిత్స అందించకపోతే అతడి ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఈ రక్తపు గడ్డలు గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటి కీలక అవయవాలకు చేరితే ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది," అని వైద్యులు తమ నివేదికలో స్పష్టం చేశారు.

అనంతపురం ఆస్పత్రిలో సర్జన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, రక్తపు గడ్డలను తొలగించేందుకు అవసరమైన 'హార్ట్-లంగ్ మెషీన్', ఇతర అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవని వైద్య బృందం తెలిపింది. అందువల్ల అతడిని మెరుగైన వైద్యం కోసం ఉన్నత స్థాయి ఆస్పత్రికి తరలించాలని సిఫార్సు చేసింది.

వైద్య నివేదికను పరిశీలించిన అనంతరం హైకోర్టు…. అతడి తరలింపునకు అనుమతి ఇచ్చింది. "వైద్య నివేదిక ఆధారంగా హేమంత్‌ను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు కోర్టు అనుమతించింది. దాదాపు 10 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నడుమ ఎస్కార్ట్ వాహనంలో అతడిని కర్నూలుకు తీసుకెళ్లాము" అని ఒక పోలీసు అధికారి వివరించారు.

రాప్తాడు దాడి ఘటన తర్వాత పరారైన హేమంత్‌ను పోలీసులు నవంబర్ 1న ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పట్టుకున్నారు. అయితే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ గాయాలపాలైన హేమంత్‌ను చికిత్స కోసం తొలుత అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

తుపాకీ గాయాల వల్ల తలెత్తిన సమస్యలతో అతడి కుడి కాలికి రక్త ప్రసరణ నిలిచిపోయింది. దీనికి తోడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి గ్యాంగ్రీన్ ఏర్పడటంతో, వైద్యులు నవంబర్ 3వ తేదీ అర్ధరాత్రి సమయంలో శస్త్రచికిత్స చేసి అతడి కుడి కాలిని తొలగించారు. నిరంతరం వైద్యం అందిస్తున్నప్పటికీ అతడి ఆరోగ్యం మెరుగుపడలేదు.

ఇటీవల శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో వైద్యులు నవంబర్ 10న సీటీ స్కాన్ నిర్వహించారు. ఈ స్కాన్‌లో ఊపిరితిత్తులకు రక్తాన్ని అందించే నాళాలతో పాటు ఇతర రక్తనాళాల్లో చిన్నచిన్న రక్తపు గడ్డలు ఉన్నట్లు తేలింది. శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించక తప్పలేదు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks