AP student suicide : చదువు పూర్తయినా దొరకని ఉద్యోగం, వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు - అమెరికాలో కర్నూల్ విద్యార్థి ఆత్మహత్య
Andhra student suicide in US : అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇరగనబోయిన చందు (26) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగ వేటలో ఎదురైన వైఫల్యాలు, ఇంటి వద్ద తండ్రి పడుతున్న కష్టం చూసి మనస్తాపానికి గురై… ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Andhra student suicide in US : కన్నవారి కష్టాలను తీర్చాలని…. అమెరికాలో ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలని ఆ యువకుడు ఎన్నో కలలు కన్నాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ కలలన్నీ చిధ్రమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ఇరగనబోయిన చందు (26) అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా, ప్రవాస భారతీయుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉద్యోగం దొరకకపోవడం, పెరుగుతున్న ఆర్థిక భారమే ఆత్మహత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది.

ఇరగనబోయిన చందు… చికాగోలోని డిపాల్ యూనివర్సిటీ (DePaul University) నుంచి ఇటీవలే తన మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించి, తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన ఎంతో ప్రయత్నించాడు. గత కొన్ని వారాలుగా అమెరికాలోని పలు కంపెనీల్లో ఉద్యోగాల కోసం తీవ్రంగా వెతికినా ఫలితం లేకపోయింది. మరోవైపు, అమెరికాలో జీవన వ్యయం పెరగడం… మరోవైపు ఆర్థిక ఇబ్బందులు పెరగటంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు.
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకుపైనే ఆశలన్నీ..
చందు కుటుంబ నేపథ్యం అత్యంత దయనీయంగా ఉంది. కర్నూలు జిల్లాలో ఆయన తండ్రి ఒక సాధారణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తన తండ్రి అంత కష్టపడి సంపాదిస్తున్నా, తాను మాత్రం ఇంకా వారిపైనే ఆధారపడటం చందును మానసికంగా కృంగదీసింది. ఆశించిన ఫలితం రాకపోవడం, ఇంటి వద్ద తండ్రి పడుతున్న కష్టం, పెరుగుతున్న అప్పులు అతడిని కలచివేశాయి. తన వల్ల కుటుంబానికి భారం పెరుగుతోందన్న ఆవేదనతోనే చందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ విషాద ఘటనపై అమెరికాలోని తెలుగు సంఘాలు స్పందించాయి. చందు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు తానా (TANA) కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు విరాళాల సేకరణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై స్పందించారు.
"ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. మృతదేహాన్ని క్షేమంగా, వేగంగా భారత్‌కు తరలించేలా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం" అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖతో పాటు ఎంబసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
చందు మరణంపై అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తెలుగు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగ వేటలో ఉన్న విద్యార్థులు… ధైర్యంగా ఉండాలని, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోరాలని నిపుణులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

