Vizianagaram software engineer dead in US : అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని…. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడాలనుకున్న ఓ యువకుడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. స్నేహితులతో సరదా గడిపేందుకు ఓ జలపాతానికి వెళ్లగా… ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళ్తే…. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయిహరికృష్ణ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో తన స్నేహితులతో కలిసి కాలిఫోర్నియాలోని ఓ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి జలపాతంలోని లోతైన నీటిలో పడిపోయారు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రవాహం వేగంగా ఉండటంతో ఆయన నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.
ఈ విషాద వార్తతో సాయిహరికృష్ణ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రమాదేవి కన్నీరుమున్నీరవుతున్నారు. సాయిహరికృష్ణ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరోవైపు సాయికృష్ణ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మృతదేహం పిరిడి గ్రామానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.