AP Municipal Elections Live Updates : ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల రీపోలింగ్.. ఎస్ఈసీ నిర్ణయం

Nov 1, 2026, 22:36:05 IST

AP Municipal Elections Live Updates : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 13 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

ఏపీ మున్సిపల్ ఎన్నికలు (AI Image)
ఏపీ మున్సిపల్ ఎన్నికలు (AI Image)

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 13 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది.

Follow all the updates here:
  • 1 Nov 2026, 10:36:05 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల రీపోలింగ్

    ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ ఎన్నికల్లో మూడు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నివేదిక ఆధారంగా ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ పరిధి 23 వార్డులోని 2 పోలింగ్ బూత్‌లలో, ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని 14 వార్డులలోని ఒక బూత్, అలాగే అనంతపురం నగరపాలక సంస్థ 30 డివిజన్‌లోని పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది.

  • 1 Nov 2026, 08:20:59 PM IST

    20 జిల్లాల్లో 41 ఘటనలు.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

    ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. 20 జిల్లాల్లో 41 ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. వాటికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. జరిగిన ఘటనలపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

  • 1 Nov 2026, 07:30:11 PM IST

    పిఠాపురంలో రీ పోలింగ్‌ నిర్వహించాలని జనసేన నేతల ఆందోళన

    కాకినాడ జిల్లా పిఠాపురంలో రథాలపేటలోని 18, 19 వార్డుల పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులు, ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలో ఉంచి జనసేన అభ్యర్థి, ఏజెంట్‌ను అనుమతించకపోవడం మీద నిరసన వ్యక్తమైంది. కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పోలింగ్‌ కేంద్రం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. జనసేన కార్యకర్తల ఆందోళనతో వారిద్దరినీ డీఎస్పీ అనుమతించారు. వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు అని 19వ వార్డులో రీ పోలింగ్ నిర్వహించాలని జనసేన ఆందోళనకు దిగింది. పోలీసులు రంగంలోకి దిగారు. వైసీపీ, జనసేన కార్యకర్తలను పంపించారు. ఎంపీ, ఎమ్మెల్యే, జనసేన నేతలు పోలింగ్‌ కేంద్రం దగ్గర నుంచి వెళ్లిపోయారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

  • 1 Nov 2026, 06:32:53 PM IST

    ఆధారాలు చూసి నిర్ణయం తీసుకుంటాం.. ఎస్ఈసీ అనిల్ చంద్ర

    ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా మీడియా సమావేశంలో మాట్లాడారు. పులివెందుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పులివెందుల అంశం మీద ఎస్పీతో మాట్లాడినట్టుగా వెల్లడించారు. నివేదిక వస్తే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే.. అధికారులు నివేదిక పంపుతారని చెప్పారు. కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

  • 1 Nov 2026, 06:16:09 PM IST

    ముగిసిన ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్... నవంబర్ 3న ఫలితాలు

    ఏపీలో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు. 11 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో పోలింగ్ ముగిసినట్లుగా తెలిపారు. నవంబర్ 3వ తేదీన ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.

  • 1 Nov 2026, 04:59:06 PM IST

    పులివెందులలో ప్రశాంతంగా పోలింగ్ : కలెక్టర్

    కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. అన్ని చోట్లా వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నట్టుగా పేర్కొన్నారు. పులివెందులలో పోలింగ్ ప్రక్రియపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.18 శాతం పోలింగ్ నమోదైందన్నారు.

  • 1 Nov 2026, 04:45:11 PM IST

    మధ్యాహ్నం 3 గంటల వరకు 48.03 శాతం పోలింగ్

    ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.03 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీలో 73.96 శాతం నమోదైంది. అత్యల్పంగా విశాఖ జీవీఎంసీలో 39.72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.

  • 1 Nov 2026, 03:35:31 PM IST

    పులివెందులలో ఓటు వేయని జగన్

    పులివెందులలో వైఎస్ జగన్ ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. రీపోలింగ్ పెడితేనే వచ్చి మళ్లీ ఓటు వేస్తానని చెప్పారు. ఈ ఎన్నికలు చూస్తే.. సంస్కరణలు ఎంత అవసరమో తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్ఈసీ ఎవరి చేతుల్లో ఉందో తెలుసు అన్నారు.

  • 1 Nov 2026, 03:03:41 PM IST

    అనంతపురంలో రిగ్గింగ్ కలకలం

    అనంతపురంలోని హమాలి కాలనీలో రిగ్గింగ్ ఆరోపణలు కలకలం రేపాయి. 30వ వార్డులో బీజేపీ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించడంతో ఇరు పార్టీల కార్యకర్తలు మధ్య తోపులాట జరిగింది.

  • 1 Nov 2026, 02:30:28 PM IST

    ఒంటి గంట వరకు 37.13 శాతం పోలింగ్.. కనిగిరిలో అత్యధికం

    ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.13 శాతం పోలింగ్ నమోదైంది. అధికంగా మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో 61.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో జమ్మలమడుగు 61.86, నగరిలో 60.81 శాతం పోలింగ్ నమోదైంది.

  • 1 Nov 2026, 01:50:07 PM IST

    జగన్ కాన్వాయ్ వైపు వెళ్లిన దస్తగిరి.. అడ్డుకున్న పోలీసులు

    మాజీ సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఆసక్తికర ఘటన జరగింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి జగన్ కాన్వాయ్ వైపు వచ్చాడు. ఈ విషయం గురించి కార్యకర్తలు జగన్ దగ్గర ప్రస్తావించారు. పోలీసులు ఈ సమయంలో దస్తగిరిని అడ్డుకున్నారు. అతడిని చూసీచూడనట్టుగా జగన్ వెళ్లిపోయారు.

  • 1 Nov 2026, 01:33:43 PM IST

    ఆర్వో ఆఫీసు ముందు జగన్

    పులివెందుల ఆర్వో ఆఫీసు ముందు జగన్ బైఠాయించారు. 70 మంది వైసీపీ ఏజెంట్లతో ఆర్వో ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. పోలింగ్ బూత్‌ల్లోకి వైసీపీ ఏజెంట్లను అనుమతించడం లేదని జగన్ ఆరోపించారు.

  • 1 Nov 2026, 01:24:43 PM IST

    మా ఏజెంట్లను అనుమతించటం లేదు - జగన్

    పులివెందులలోని ఆర్వో కార్యాలయానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. పోలింగ్ బూత్‌ల్లోకి వైసీపీ ఏజెంట్లను అనుమతించట్లేదని ఫిర్యాదు చేశారు.

  • 1 Nov 2026, 12:52:40 PM IST

    జగన్ పై వర్ల రామయ్య ఫైర్

    జగన్ పై టీడీపీ లీడర్ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఓటు వేసేందుకు వైఎస్ జగన్ ఇంత ఆర్భాటం చేయాలా? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ డైరెక్షన్‌లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. పులివెందుల ఓటర్లు స్వేచ్ఛగా ఓట్లు వేస్తున్నారు.. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 1 Nov 2026, 12:50:21 PM IST

    కొనసాగుతున్న పోలింగ్…

    రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఇప్పటికే పలువరు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

  • 1 Nov 2026, 12:32:03 PM IST

    ప్రశాంతంగా పోలింగ్ - ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా

    రాష్ట్రంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా తెలిపారు. విజయవాడలో పలు పోలింగ్‌ కేంద్రాలను ఆయన సందర్శించారు. నమోదైన పోలింగ్‌ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

  • 1 Nov 2026, 12:07:51 PM IST

    ఇది ప్రజాస్వామ్యమేనా? - వైఎస్ జగన్

    పోలీసులే దగ్గరుండి ప్రజాస్వామయ్యాన్ని ఖూనీ చూస్తున్నారని వైెఎస్ జగన్ ఆరోపించారు. అందుకు పులివెందులలో జరుగుతున్న ఘటనలే నిదర్శనమన్నారు. 80పోలింగ్ బూతులు ఉంటే, 70 పోలింగ్ బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేరని చెప్పారు. ఉదయం 4 గంటల నుంచే టీడీపీ వాళ్లు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకున్నారని… వచ్చిన ఓటర్లను పోలీసులే వెనక్కి పంపుతున్నారని ఆరోపించారు.అధికార పార్టీకి పోలీసులే సహకరిస్తున్నారు.. ఇది ప్రజాస్వామ్యమేనా? అని జగన్ ప్రశ్నించారు.

  • 1 Nov 2026, 12:06:39 PM IST

    22.08 శాతం పోలింగ్

    ఏపీ వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 22.08 శాతం పోలింగ్ నమోదైంది. గుంటూరు కార్పొరేషన్‌లో ఉదయం 11 గంటల వరకు 18 శాతం, తిరుపతి కార్పొరేషన్‌లో ఉ.11 గంటల వరకు 20.12 శాతం పోలింగ్. పలమనేరులో ఉ.11 గంటల వరకు 33.2 శాతం పోలింగ్.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 31 శాతం, వినుకొండలో 27 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

  • 1 Nov 2026, 11:46:22 AM IST

    1,000 మంది సిబ్బంది

    ఉద్రిక్తతను తగ్గించడానికి పులివెందులలో సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘా ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సర్వసన్నద్ధంగా ఉన్నారని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు.

  • 1 Nov 2026, 11:45:49 AM IST

    ఇరువైపుల దాడి

    ఎన్నికల సందర్భంగా కడప జిల్లా పులివెందుల పట్టణంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వివాదం చెలరేగి, పరస్పరం రాళ్లదాడికి దిగినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. రెండు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకరిపైకొకరు రాళ్లు రువ్వుకోవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

  • 1 Nov 2026, 11:45:33 AM IST

    కొనసాగుతున్న పోలింగ్

    వైఎస్సార్‌సీపీ, అధికార టీడీపీ వర్గాల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణలు చోటుచేసుకున్న కడప జిల్లా పులివెందుల మినహా, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 1 Nov 2026, 11:05:22 AM IST

    ఓటింగ్ నమోదు గణాంకాలు

    ఉదయం 9 గంటల వరకు 8.39 శాతం పోలింగ్ నమోదు

    మార్కాపురంలో 19.47 శాతం పోలింగ్ నమోదు

    రాష్ట్రంలో ప్రస్తుతానిక అత్యల్పంగా గుంతకల్‌లో 2.95 శాతం పోలింగ్ నమోదు

    నిడదవోలులో 3.17 శాతం, జీవీఎంసీలో 3.34 శాతం పోలింగ్ నమోదు

    బుచ్చిరెడ్డిపాలెంలో 4.02 శాతం పోలింగ్ నమోదు

    రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జీవీఎంసీలో 18.37 లక్షల మందికి గాను 61,309 మంది ఓటు హక్కు వినియోగం

    విజయవాడలో 8.05 లక్షల మంది ఓటర్లకు గాను 62,740 మంది ఓటింగ్

    గుంటూరులో 6.18 లక్షల మంది ఓటర్లకు గాను 32,237 ఓట్లు నమోదు

    కర్నూలులో 53,504 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగం..

  • 1 Nov 2026, 10:53:20 AM IST

    జమ్మలమడుగులో ఉద్రిక్తత

    జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకుంటున్నారని రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను టీడీపీ, బీజేపీ, పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

  • 1 Nov 2026, 10:38:22 AM IST

    8 శాతం పోలింగ్ నమోదు

    ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 8 శాతం పోలింగ్ నమోదైంది.

  • 1 Nov 2026, 10:04:17 AM IST

    ఎమ్మిగనూరులో ఉద్రిక్తత

    ఎమ్మిగనూరు గోనెగండ్ల బైపాస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిటీలోకి రాకుండా వైసీపీ ఇన్‌ఛార్జ్ రాజీవ్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు.

  • 1 Nov 2026, 09:50:46 AM IST

    సత్తెనపల్లిలో ఉద్రిక్తత

    పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. 19వ వార్డులో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

  • 1 Nov 2026, 09:49:57 AM IST

    పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో హై టెన్షన్

    పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై టీడీపీ శ్రేణుల దాడికి దిగారు. 21వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా దాడి జరిగింది. 1, 2 వార్డుల్లో ఓటు వేయనివ్వడం లేదని మహిళలు ఆందోళన చేపట్టారు.

  • 1 Nov 2026, 08:45:33 AM IST

    మదనపల్లెలో ఉద్రిక్తత

    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్‌లోకి తమ ఏజెంట్లను అనుమతించడంలేదని వైసీపీ ఆందోళన చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వెంకటచలపతి ధర్నాకు దిగారు.

  • 1 Nov 2026, 08:22:48 AM IST

    గుర్తులు తారుమారు - నిలిచిన పోలింగ్

    విజయవాడ నగరంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 55వ డివిజన్‌లో బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్‌ పేపర్‌లో గుర్తులు మారడంపై వైకాపా అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలింగ్‌ను నిలిపివేశారు. కొత్తగా బ్యాలెట్‌ పేపర్లు ముద్రించిన అనంతరం సుమారు 2 గంటల తర్వాత పోలింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

  • 1 Nov 2026, 07:58:58 AM IST

    పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత

    పులివెందుల 27వ వార్డులో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వృద్ధురాలి చేతిలోని బ్యాలెట్ స్లిప్‌ను పలువురు ఏజెంట్లు లాకున్నారు. పులివెందుల సత్రం స్కూల్ పోలింగ్ బూత్ దగ్గర ఈ ఘటన జరిగింది.

  • 1 Nov 2026, 07:58:16 AM IST

    పలువురు హౌస్ అరెస్ట్

    పల్నాడు జిల్లాలో పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని ఇంట్లో నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు.

  • 1 Nov 2026, 07:40:48 AM IST

    పులివెందులలో భారీ భద్రత

    ఎన్నికల బందోబస్తులో భాగంగా పులివెందులలో డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు వజ్ర వాహనంతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్ నుంచి పూల అంగళ్ల సర్కిల్, పాత బస్టాండ్ మీదుగా ఈ కవాతు సాగింది. భద్రతా ఏర్పాట్లను డీఐజీ కోయా ప్రవీణ్ స్వయంగా సమీక్షించారు. పులివెందులలో ఇప్పటికే 700 మంది పోలీసులను మోహరించడంతో పాటు సమస్యాత్మక మూలాలు ఉన్న 1000 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.

  • 1 Nov 2026, 07:36:23 AM IST

    మున్సిపల్ ఎన్నికలు - ముఖ్య వివరాలు

    రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు 153 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అన్ని కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి.

    70 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ పదవులకు 367 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్లలోని 922 వార్డులకు 3,073 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మున్సిపాలిటీల్లోని 2,382 వార్డులకు 6,669 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 9,642 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

  • 1 Nov 2026, 07:35:21 AM IST

    కమిషనర్ కీలక ఆదేశాలు

    పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర పోలీస్ బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

  • 1 Nov 2026, 07:34:31 AM IST

    ఓటు హక్కును వినియోగించుకోండి - ఎన్నికల కమిషనర్

    రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకుని స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

  • 1 Nov 2026, 07:33:27 AM IST

    నిఘా నీడలో….

    ఓటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం నుంచే ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరించి, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు.

  • 1 Nov 2026, 07:33:03 AM IST

    ఈ స్థానాల్లో పోలింగ్

    మొత్తం 92 స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేయగా, 8 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో నేడు ప్రత్యక్ష పోలింగ్ జరుగుతోంది. ఎన్నికలకు ముందే భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడం విశేషం. 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మొత్తం 17 చోట్ల చైర్‌పర్సన్ పదవులు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి.

  • 1 Nov 2026, 07:31:12 AM IST

    పోలింగ్ ప్రారంభం

    ఆంధ్రప్రదేశ్ పురపాలక పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల పరిధిలో ఓటింగ్ ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ సాగుతోంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్య పండుగ వాతావరణం నెలకొంది.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks