AP Municipal Elections Live Updates : ఏపీ మున్సిపల్ ఎన్నికలు - కొనసాగుతున్న పోలింగ్
AP Municipal Elections Live Updates : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 13 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. లైవ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 13 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలలో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.
...Read Moreమదనపల్లెలో ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ బూత్‌లోకి తమ ఏజెంట్లను అనుమతించడంలేదని వైసీపీ ఆందోళన చేపట్టింది. రోడ్డుపై బైఠాయించి వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వెంకటచలపతి ధర్నాకు దిగారు.
గుర్తులు తారుమారు - నిలిచిన పోలింగ్
విజయవాడ నగరంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పేపర్లో గుర్తులు మారడంపై వైకాపా అభ్యర్థి రిటర్నింగ్ అధికారి (ఆర్వో) చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలింగ్‌ను నిలిపివేశారు. కొత్తగా బ్యాలెట్ పేపర్లు ముద్రించిన అనంతరం సుమారు 2 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత
పులివెందుల 27వ వార్డులో పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వృద్ధురాలి చేతిలోని బ్యాలెట్ స్లిప్‌ను పలువురు ఏజెంట్లు లాకున్నారు. పులివెందుల సత్రం స్కూల్ పోలింగ్ బూత్ దగ్గర ఈ ఘటన జరిగింది.
పలువురు హౌస్ అరెస్ట్
పల్నాడు జిల్లాలో పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని, వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని ఇంట్లో నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు.
పులివెందులలో భారీ భద్రత
ఎన్నికల బందోబస్తులో భాగంగా పులివెందులలో డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు వజ్ర వాహనంతో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్ నుంచి పూల అంగళ్ల సర్కిల్, పాత బస్టాండ్ మీదుగా ఈ కవాతు సాగింది. భద్రతా ఏర్పాట్లను డీఐజీ కోయా ప్రవీణ్ స్వయంగా సమీక్షించారు. పులివెందులలో ఇప్పటికే 700 మంది పోలీసులను మోహరించడంతో పాటు సమస్యాత్మక మూలాలు ఉన్న 1000 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
మున్సిపల్ ఎన్నికలు - ముఖ్య వివరాలు
రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు 153 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అన్ని కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి.
70 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు 367 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్లలోని 922 వార్డులకు 3,073 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మున్సిపాలిటీల్లోని 2,382 వార్డులకు 6,669 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 9,642 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
కమిషనర్ కీలక ఆదేశాలు
పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లకు సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర పోలీస్ బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఓటు హక్కును వినియోగించుకోండి - ఎన్నికల కమిషనర్
రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకుని స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
నిఘా నీడలో….
ఓటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం నుంచే ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరించి, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు.
ఈ స్థానాల్లో పోలింగ్
మొత్తం 92 స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేయగా, 8 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో నేడు ప్రత్యక్ష పోలింగ్ జరుగుతోంది. ఎన్నికలకు ముందే భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడం విశేషం. 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మొత్తం 17 చోట్ల చైర్పర్సన్ పదవులు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి.
పోలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ పురపాలక పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల పరిధిలో ఓటింగ్ ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ సాగుతోంది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్య పండుగ వాతావరణం నెలకొంది.

E-Paper

