ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో రాములవారు ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు.

ఉదయం 7.30 గంటల నుంచి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్నదొంగ. రేపల్లెలో బాలకృష్ణుడు యశోదమ్మ ఇంట్లోనే గాక అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న ఆరగించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీలలను గుర్తు చేస్తూ రాములవారు వెన్నకుండతో భక్తులకు దర్శనమిచ్చారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.
తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధం:
ఏప్రిల్ 1వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతా రాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి.
తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ను ఆదివారం టీటీడీ ఒక బృహత్కార్యక్రమంగా నిర్వహించింది. ఈ లడ్డూల ప్యాకింగ్ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు అపార భక్తి, శ్రద్ధలతో పాల్గొన్నారు.