తిరుపతి : మార్మోగిన గోవింద నామస్మరణ - వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం

Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగి స్వామివారిని దర్శించుకున్నారు. రేపు కపిలతీర్థంలో చక్రస్నానం జరగనుంది.

Published on: May 30, 2026, 15:27:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత నయనానందకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. "గోవిందా.. గోవిందా.." అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో తిరుపతి పురవీధులు మార్మోగాయి. వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో, తన్మయత్వంతో స్వామివారి రథాన్ని లాగి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.

తిరుపతి : మార్మోగిన గోవింద నామస్మరణం - వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం
తిరుపతి : మార్మోగిన గోవింద నామస్మరణం - వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం

ఉదయం 5.40 గంటల శుభ ముహూర్తాన ప్రారంభమైన ఈ రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా సాగింది. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు రోడ్ల ఇరుపక్కలా భారీగా నిలిచారు. రథం కదిలిన మార్గమంతా భక్తులు టెంకాయలు కొట్టి, కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారికి మంగళారతులు అర్పించారు. అనంతరం రథం తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది.

సనాతన ధర్మంలో రథోత్సవానికి కేవలం ఒక వేడుకగానే కాకుండా, ఆత్మజ్ఞానాన్ని బోధించే మహత్తర తాత్త్విక సందేశంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. మానవ శరీరమే ఒక రథం. అందులోని ఆత్మను రథికుడిగా, శరీరాన్ని రథంగా, మానవ బుద్ధిని రథ సారథిగా, మనసును పగ్గంగా, మన ఇంద్రియాలను గుర్రాలుగా, బాహ్య ప్రపంచంలోని విషయాలను వీధులుగా భావించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆత్మ–అనాత్మ వివేకాన్ని, జీవిత పరమార్థాన్ని ఈ ఉత్సవం భక్తులకు నొక్కి చెబుతుంది.

వేడుకగా స్నపన తిరుమంజనం

రథోత్సవం విజయవంతంగా ముగిసిన అనంతరం ఆలయంలో ఇతర ధార్మిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి, నమ్మాళ్వార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్లరసాలతో విశేషంగా అభిషేకం చేశారు.

  • బ్రహ్మోత్సవాల క్రతువులో భాగంగా శనివారం సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ (ఊయల సేవ) జరగనుంది.
  • ఆ తర్వాత రాత్రి 7 నుండి 9 గంటల వరకు అత్యంత వైభవంగా అశ్వవాహన సేవను నిర్వహించనున్నారు.
  • కల్కి అవతార స్వరూపుడైన గోవిందుడు అశ్వవాహనంపై అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
  • శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 31, ఆదివారంతో ముగియనున్నాయి.
  • ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం (ఆళ్వార్ తీర్థం)లో చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
  • ఇందుకోసం ఉదయం 6 గంటలకే శ్రీ గోవిందరాజస్వామివారు, అమ్మవార్లు తిరుచ్చిపై, చక్రతాళ్వార్ పల్లకీలో కొలువై కపిలతీర్థ క్షేత్రానికి ఊరేగింపుగా బయలుదేరనున్నారు.
  • కపిలతీర్థంలో పవిత్ర చక్రస్నానం పూర్తయిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పీఆర్‌ తోటకు వేంచేపు చేస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం… సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More