...
...
Next Story

ఏపీకి తీవ్ర తుపాను ముప్పు - అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఇవే

ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ మేరకు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేశారు.

Published on: Oct 25, 2026, 13:36:13 IST
Advertisement

రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని… సూచించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

సంప్రదించాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు:

తుపాను ముప్పు - కీలక సూచనలు
తుపాను ముప్పు - కీలక సూచనలు

ఏదైనా అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండే స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (SEOC) టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు అని పేర్కొంది.

  • 112
  • 1070
  • 1800 425 0101

పాటించాల్సిన మార్గదర్శకాలు:

  • సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన పుకార్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ప్రశాంతంగా ఉంటూ మానసిక ధైర్యాన్ని కాపాడుకోవాలి.
  • అత్యవసర సమాచార మార్పిడి కోసం మొబైల్ ఫోన్‌లను నిరంతరం ఛార్జ్ చేసి ఉంచుకోవాలి. విపత్తుల నిర్వహణ సంస్థ పంపే హెచ్చరిక ఎస్ఎంఎస్ (SMS) లను ఎప్పటికప్పుడు గమనించాలి.
  • రేడియో, టీవీ వార్తలు చూడటం మరియు వార్తాపత్రికలు చదవడం ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి.
  • ఆధార్, పాస్‌పోర్ట్, ఆస్తి పత్రాలు, విద్యా సంబంధిత సర్టిఫికెట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలి.
  • టార్చ్ లైట్, మందులు, పొడి ఆహార పదార్థాలతో కూడిన అత్యవసర వస్తు సామగ్రిని ముందే సిద్ధం చేసుకోవాలి.
  • ఇంటి పైకప్పును తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు ఉంటే ముందే పూర్తి చేయాలి.
  • లోతట్టు ప్రాంతాలు, వరదలు లేదా ఉప్పెన ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు వెంటనే అధికారులు ఏర్పాటు చేసిన ఎత్తైన, సురక్షితమైన ఆశ్రయ ప్రాంతాలకు (షెల్టర్లకు) వెళ్లాలి.
  • కనీసం ఒక వారానికి సరిపడా తాగునీరు, తడిసిపోని ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవాలి.
  • ఇంటి తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయాలి. అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.

తుపాను సమయంలో (ఇంట్లో ఉంటే):

  • ప్రమాదాలను నివారించడానికి ఇంట్లోని ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి; గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను తొలగించాలి.
  • ఈదురు గాలుల ధాటికి అద్దాలు పగలకుండా తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి.
  • మీరు నివసించే భవనం సురక్షితం కాదని భావిస్తే, ముందే సురక్షిత రీతిలో ఉన్న ప్రభుత్వ షెల్టర్‌కు చేరుకోవాలి.
  • నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి కాచి చల్లార్చిన లేదా క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలి.
  • ఒకవేళ భవనం దెబ్బతినే సూచనలు కనిపిస్తే, స్వయంగా రక్షణ కోసం ఒక బలమైన టేబుల్ లేదా బెంచ్ కింద దాక్కోవాలి.

తుపాను సమయంలో (బయట ఉంటే):

  • దెబ్బతిన్న, శిథిలావస్థలో ఉన్న లేదా పాత భవనాల్లోకి ఆశ్రయం కోసం వెళ్లవద్దు.
  • భారీ గాలులు వీచేటప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాలు మరియు ప్రకటనల హోర్డింగ్‌ల కింద ఎప్పుడూ నిలబడవద్దు.
  • గాలుల తీవ్రత తగ్గినా తుపాను ముగిసిందని భావించవద్దు. అధికారులు అధికారికంగా 'ఆల్ క్లియర్' ప్రకటించే వరకు బయటకు రాకూడదు.

తుపాను తదుపరి చర్యలు….

  • నీటిని కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగాలి.
  • అధికారులు స్పష్టమైన సమాచారం ఇచ్చే వరకు షెల్టర్లను వదిలి ఇళ్లకు వెళ్లకూడదు.
  • రోడ్లపై తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాల పట్ల తీవ్ర జాగ్రత్త వహించాలి; వాటికి దూరంగా ఉండాలి.
  • నీటిలో తడిసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ ద్వారా పూర్తిగా తనిఖీ చేయించిన తర్వాతే తిరిగి వాడాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks