విశ్లేషణ : నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు రూపం... పవన్ కళ్యాణ్
వెండితెర శిఖరాల నుంచి జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్…. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావటంతో పవన్ ప్రస్థానంపై ఆ పార్టీ ఎంపీ లింగమనేని రమేశ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చేసిన విశ్లేషణ….
రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు కేవలం ఓట్ల లెక్కింపునకు, ఎన్నికల్లో గెలుపోటములకు మాత్రమే పరిమితం కావు. అవి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న విశ్వాసానికి, సామాజిక న్యాయ పోరాటానికి, చెరిగిపోని ఒక ఆశయానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సరిగ్గా అలాంటి ఒక అరుదైన, రాజకీయ ప్రభంజనమే జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
వెండితెరపై కోట్లాది మంది అభిమానాన్ని చూరగొని…. అగ్రస్థానంలో ఉన్నవారెవరైనా తమ ప్రజాదరణను ఆధారం చేసుకుని అధికారం కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా రాలేదు. సకల సౌఖ్యాలను, సురక్షితమైన జీవితాన్ని, కళ్లు చెదిరే పారితోషికాలను వదులుకుని...నిత్యం సమస్యలతో నలిగిపోయే పేద ప్రజల కష్టాలను తీర్చడానికి కంటకప్రాయమైన ముళ్ల బాటను ఎంచుకున్నారు.
సెప్టెంబర్ 2న ఆయన పుట్టిన రోజు సందర్భంగా... ఒక ఆశయంగా, ఒక ఆవేశంగా, ధర్మానికి ఒక ఆశగా మారిన ఆయన విలక్షణ వ్యక్తిత్వాన్ని, రాజీలేని రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకోవడం ప్రతి జనసైనికుడికి, ప్రతి తెలుగువాడికి ఎంతో గర్వకారణం. భారతీయ సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఆయన ఒక నటుడు మాత్రమే కాదు, కోట్లమంది యువత గుండె చప్పుడుగా మారిన ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన నడక, నడత, నవ్వు, మాట్లాడే తీరు, ఆలోచనా ధోరణి... ప్రతీదీ ఆయనను యూత్ ఐకాన్‌గా ప్రతిష్ఠించాయి. అశేష ఆదరణ, కోట్ల రూపాయల వైభవం ఆయన కాళ్ల దగ్గర దాసోహమన్నాయి.
పనన్ కళ్యాణ్ గ్లామర్ వెనుక ఒక నివురు గప్పిన నిప్పు ఉందేది. ఆ నిప్పు పేరు 'సామాజిక బాధ్యత'. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, కౌలు రైతుల కన్నీళ్లు, యువత నిరాశ, వ్యవస్థల పతనం ఆయనను నిద్రపోనివ్వలేదు. కేవలం తెరపై హీరోగా నటిస్తే సరిపోదని, నిజ జీవితంలో సమాజ మార్పు కోసం ఒక యోధుడిలా పోరాడాలని ఆయన సంకల్పించారు. తనను గుండెల్లో పెట్టుకున్న ప్రజలకు ఏదైనా తిరిగి ఇవ్వాలనే తపనే ఆయనను రాజకీయాల వైపు అడుగులు వేయించింది.
2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భవించింది. ఆ రోజు హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ఒక ఆవేశపూరిత సునామీలా సాగింది. తాను అధికార దాహంతో కాదు, ప్రశ్నించే గొంతుకగా నిలవడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన ప్రకటిస్తే, తెలుగు నేల పులకించిపోయింది.
రాజకీయాలను స్వార్థానికి వాడుకోకపోవడానికి పవన్ కళ్యాణే నిలువెత్తు నిదర్శనం. ఇది అనేకసార్లు రుజువైంది. 2014 ఎన్నికల్లో నవ్యాంధ్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర స్థిరత్వం కోసం కూటమి విజయంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. విజయం సాధించిన వెంటనే ఆయన అనుకుంటే కేంద్రంలోనో, రాష్ట్రంలోనో పదవులను డిమాండ్ చేసి పొందే అవకాశం ఉంది. కానీ, విడిపోయిన రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే ముఖ్యమని భావించిన ఆయన, ఎటువంటి పదవులనూ ఆశించకుండా తన నిస్వార్థత త్యాగాన్ని చాటుకున్నారు.
జనసేన పార్టీ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు "ప్రతి చేతికి పని... ప్రతి చేనుకు నీరు" అందించడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేశారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోగతి, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి కల్పనల చుట్టూనే ఆయన రాజకీయ ఆలోచనా విధానం నిరంతరం తిరుగుతుంది. 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం.
వైఎస్సార్సీపీ సాగించిన ప్రజా వ్యతిరేక విధానాలపై, అరాచక పాలనపై పవన్ కళ్యాణ్ ఎక్కడా రాజీ పడకుండా పోరాటం చేశారు. 2019 ఎన్నికల ఫలితాలు ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఎన్నో అవమానాలు, ప్రజలకోసం పడ్డారు. కుటుంబాన్ని,ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి వైఎస్సార్సీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా రాష్ట్ర శ్రేయస్సు కోసం వాటని భరించారు. వారాహి రథమెక్కి రాష్ట్రమంతటా పర్యటిస్తూ వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగట్టారు. విశాఖపట్నం పర్యటనలో ఆయనను హోటల్ గదికి పరిమితం చేసి నిర్బంధించినా, ఆయన పడిన వేధింపులను లెక్కచేయకుండా ప్రజా చైతన్యాన్ని రగిలించారు.
ఈ సుదీర్ఘ పోరాట ప్రయాణంలో కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా 'సకల జనులు బాగుండాలి' అనే ఉదార తపనతో ఆయన పరితపించారు. పార్టీ శ్రేణులను, నాయకులను 'షణ్ముఖ వ్యూహం' అనే స్పష్టమైన, ప్రణాళికాబద్ధమైన లక్ష్యం వైపు నడిపిస్తూ పార్టీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. సాధారణంగా రాజకీయాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటివారి బలహీనతను లేదా ఆపదను 'పొలిటికల్ ఎక్స్‌ప్లాయిట్' (రాజకీయ ప్రయోజనం) చేసుకోవడం సగటు రాజకీయ నాయకులు చేసే పని. కానీ పవన్ కళ్యాణ్ నైతికత, వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనవి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టినప్పుడు... ఆ ప్రతికూల పరిస్థితిని తన రాజకీయ ఎదుగుదలకు లేదా అడ్వాంటేజ్‌గా తీసుకోలేదాయన. వ్యక్తిగత, పార్టీ స్వార్థాల కన్నా ప్రజాస్వామ్య విలువల రక్షణే ముఖ్యమని నమ్మారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకే వెళ్లి చంద్రబాబుకి అండగా నిలబడి, జైలు బయటే పొత్తు ప్రకటన చేసి రాజనీతిజ్ఞతను చాటుకున్నారు.
వైఎస్సార్సీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించడమే ధ్యేయంగా కూటమిని ఒక తాటిపైకి తీసుకొచ్చారు. 2024 ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి ఉన్న ప్రజాదరణ దృష్ట్యా ఇంకా ఎక్కువ సీట్లు అడగవచ్చు. కానీ… కేవలం సీట్ల సంఖ్య పెంచుకోవడం కాదు, వైఎస్సార్సీపీ రహిత రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే ముఖ్యమని భావించి 'కూటమి ధర్మం' కోసం సీట్ల సర్దుబాటులో అసమానమైన త్యాగం చేశారు. నేషన్ ఫస్ట్... పార్టీ నెక్స్ట్... పర్సన్ లాస్ట్ అనే విప్లవాత్మక సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ కేవలం వేదికలపై చెప్పడమే కాదు. ఆచరణలో చూపిస్తున్నారు. వ్యక్తుల కన్నా, పదవుల కన్నా దేశ సార్వభౌమత్వం, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమనే త్యాగనిరతితో ఆయన అడుగులు వేస్తున్నారు.
ఆయన చూపిన విశ్వసనీయతకు, నిస్వార్థ రాజకీయాలకు 2024 ఎన్నికల ఫలితాలు సాక్ష్యంగా నిలిచాయి. జనసేన పార్టీ పోటీ చేసిన 21 శాసనసభ స్థానాల్లో 21 స్థానాలనూ గెలుచుకుని, అలాగే 2 లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్‌తో దేశ రాజకీయ చరిత్రలోనే అపూర్వమైన సంచలనాత్మక రికార్డు సృష్టించింది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ-పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఒకవైపు గ్రామ స్వరాజ్యం దిశగా, ప్రతి గ్రామానికి తాగునీరు అందించడం, పంచాయతీ వ్యవస్థలకు పూర్వవైభవం తీసుకురావడం, అడవులు-పర్యావరణ పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తూ పాలనాదక్షుడిగా నిరూపించుకుంటున్నారు. మరోవైపు భారతీయ మూలాలను కాపాడుకోవడంలో భాగమైన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన తీసుకుంటున్న చొరవ దేశవ్యాప్తంగా అపారమైన ప్రశంసలు అందుకుంటోంది. ధర్మానికి విఘాతం కలిగితే సహించేది లేదని ఆయన గంభీరంగా నినదిస్తున్నారు.
జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి రాష్ట్రాన్ని మార్చే 'కింగ్ మేకర్' పాత్రను విజయవంతంగా పోషిస్తూనే ఉంది. పార్టీ భవిష్యత్తు అత్యంత ఉజ్జ్వలంగా ఉండబోతోంది. అధికారం సాధించడంలో రక్తం చిందించి, అహర్నిశలు శ్రమించిన కార్యకర్తల, నాయకుల త్యాగాలను పవన్ కళ్యాణ్ గారు ఎన్నటికీ మరచిపోరు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కార్యకర్తలకు, నాయకులకు తగిన ప్రాధాన్యతనిచ్చి, వారికి అన్ని విధాలా మంచి చేయడానికి, వారి త్యాగానికి తగిన గుర్తింపునివ్వడానికి ఆయన ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. కార్యకర్తలే తన బలమని ఆయన ప్రతి అడుగులోనూ నిరూపిస్తున్నారు.
ఈ సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ గారు మరొక వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా... కోట్లాది మంది ప్రజల, రైతు సోదరుల, మహిళల, వీరమహిళల మరియు జనసైనికుల ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. వ్యక్తుల కన్నా, స్వార్థ పదవుల కన్నా దేశం, రాష్ట్రం, ధర్మం ముఖ్యమని నమ్మి జీవిస్తున్న పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు ఇదే ప్రజా సంక్షేమ దీక్షతో ముందుకు సాగుతూ తెలుగు జాతికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేసే వెలుగులా నిలవాలి.
విశ్లేషణ : లింగమనేని రమేశ్, (పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ, జనసేన పార్టీ).

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణ రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్ (హెచ్‌టీ)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు).
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


