ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజుపై ఇంటర్మీడియట్ బోర్డు మరో అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షల ఫీజు గడువు ముగిసినప్పటికీ…. తత్కాల్ స్కీమ్‌ను కింద విద్యార్థులకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ గడువు జనవరి 5, 2026తో ముగియనుంది. ఆ తర్వాత ఎలాంటి గడువు పొడిగింపు ఉండని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని మిగిలిపోయిన విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించింది.
ఎగ్జామ్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు….

ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు మరో ప్రకటన విడుదల చేసింది. సెకండ్ ఇయర్ గణితం పేపర్-2ఏ, సివిక్స్ పేపర్-2 పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 3న జరగాల్సి ఉంది. ఈ పరీక్షలను మార్చి 4కు మార్చారు. ప్రభుత్వ క్యాలెండర్‌లో హోలీ పండుగ మార్చి 3న ఉండడంతో ఈ మార్పు చేశారు.
మార్చి 20వ తేదీన జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పరీక్షలను 21వ తేదీకి షిప్ట్ చేశారు. మార్చి 20న రంజాన్ పండుగ కావడంతో ఈ మార్పు జరిగింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి ఏడాది సిలబస్ మారడంతో పాటు పరీక్షల విధానంలోనూ మార్పులు చేయడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బ్యాక్‌లాగ్ సబ్జెక్టులకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఇచ్చారు.
ఇక ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జనవరి 21వ తేదీ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. ఇక ఇక ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు పూర్తి అయ్యాక… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు.