AP NTR Bharosa Pensions : కొత్త పింఛన్ల అప్డేట్ - దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ! ఈ ఛాన్స్ మిస్ కాకండి

AP NTR Bharosa Pension Scheme : సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇవాళ్టితో గడువు పూర్తి కానుంది. అర్హులైన వారెవరూ నష్టపోకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Published on: Sep 18, 2026, 12:29:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP NTR Bharosa Pension Scheme :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకం 'ఎన్టీఆర్ భరోసా పింఛన్' దరఖాస్తుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నూతన పింఛన్ల కోసం స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు నేటితో పూర్తవుతుండటంతో అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత ఉండి ఇప్పటివరకు అప్లై చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఏపీలో కొత్త పింఛన్లు
ఏపీలో కొత్త పింఛన్లు

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాల్లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా తమ సమీపంలోని ఈ కౌంటర్లకు వెళ్లి నిర్ణీత ఫారమ్‌లో దరఖాస్తులను అందజేయవచ్చు.

కౌంటర్లలో సేకరించిన దరఖాస్తులను అధికారులు అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే లబ్ధిదారుల అర్హతలను ఖరారు చేస్తారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిజమైన అర్హులందరికీ దశలవారీగా కొత్త పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది.

పింఛన్ సాయం ఎంతంటే….?

  • వృద్ధులు, వితంతువులు: నెలకు రూ. 4,000 సాయం లభిస్తుంది.
  • దివ్యాంగులు: ప్రతి నెలా రూ. 6,000 పొందుతారు.
  • తీవ్ర అనారోగ్య బాధితులు: వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రూ. 10,000 వరకు అందిస్తారు.
  • సంపూర్ణ వైకల్యం ఉన్నవారు: నెలకు గరిష్టంగా రూ. 15,000 పింఛన్ పొందుతారు.

అర్హులైన అభ్యర్థులు తమ పరిధిలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రానికి వెళ్లి, సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సిబ్బందికి అందజేయాలి. ఆ వివరాలను సిబ్బంది వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. నమోదు ప్రక్రియ పూర్తికాగానే కంప్యూటర్ నుంచి జనరేట్ చేసిన అధికారిక రసీదును దరఖాస్తుదారునికి అందజేస్తారు. ఈ రసీదులోని నంబర్ ఆధారంగా భవిష్యత్తులో దరఖాస్తు ఏ దశలో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.

కావాల్సిన ముఖ్యమైన ధ్రువీకరణ పత్రాలు (డాక్యుమెంట్లు):

  • వృద్ధాప్య పింఛన్: వయస్సు ధ్రువీకరణ కోసం లబ్ధిదారుడి ఆధార్ కార్డ్ తప్పనిసరి.
  • వితంతు పింఛన్: భర్త మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికేట్)తో పాటు వితంతువు ఆధార్ కార్డ్ జతచేయాలి.
  • ఒంటరి మహిళలు: వివాహమై భర్తకు దూరంగా ఉంటుంటే కోర్టు జారీ చేసిన విడాకుల పత్రం సమర్పించాలి. పెళ్లి కాని వారైతే తహశీల్దార్ జారీ చేసిన 'వివాహం కాలేదు' అనే ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా అందించాలి.
  • దివ్యాంగులు: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించే సదరం సర్టిఫికెట్ ఉండాలి.
  • వృత్తిపరమైన విభాగాలు: చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సాంప్రదాయ పాదరక్షల తయారీదారులు, కల్లు గీత కార్మికులు తమ సంబంధిత శాఖల అధికారుల నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది.
  • ట్రాన్స్‌జెండర్లు: జిల్లా మెడికల్ బోర్డు అధికారికంగా జారీ చేసిన సర్టిఫికేట్ జతచేయాలి.

అర్హులైన నిరుపేదలు ఎవరూ నష్టపోకుండా నేడే చివరి రోజు కావడంతో త్వరితగతిన తమ దరఖాస్తులను స్వర్ణ గ్రామ, వార్డు కేంద్రాల్లో సమర్పించాలని అధికారులు పునరుద్ఘాటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More