నిత్యం ఏపీకి పెట్టుబడులు తేస్తామని, విదేశీ పర్యటనలతో బ్రాండ్ ఇమేజ్ను ఆకాశానికి ఎత్తుతున్నామని ప్రకటించే చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? లేక దారుణంగా దిగజారిందా? అన్న అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గురువింద గింజ తన నలుపెరగదు అన్నట్లు... పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు... తాటి చెట్టు కింద ఉండి పాలు తాగినా కళ్లు తాగారనే అంటారు... ఇలా ప్రస్తుతం అధికార పక్షం ఎన్ని మాటలు చెప్తున్నప్పటికీ... ఏపీ ఇమేజ్ బ్రాండ్ దిగజారుతున్నది.

రాష్ట్రంలో ప్రజల నాడిని, వారి అంతరంగాన్ని తెలుసుకోవడానికి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ బృందం కుప్పం నుండి ఇచ్చాపురం వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించింది. ఈ పర్యటనలో ప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర ఆగ్రహావేశాలు రాష్ట్ర రాజకీయ గమనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార అండతో తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంతం నుంచి మొదలుకొని పల్నాడు, చిలకలూరిపేట వరకు జరిపిన అరాచకాలు, పోలీసు వ్యవస్థను పూర్తిగా అడ్డంపెట్టుకుని సాధించిన ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అవమానించాయి. ఏపీలోని తెలుగు మీడియా, కొన్ని ఇతర ప్రసార మాధ్యమాల్లో అధికార పార్టీ చేసిన ఈ ఏకగ్రీవాలు, దౌర్జన్యాలపై సరైన రీతిలో వార్తలు రాకపోయినప్పటికీ, జాతీయ స్థాయి మీడియాలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ నూటికి నూరుపాళ్లు దిగజారేలా అనేక విశ్లేషణాత్మక కథనాలు వెలువడ్డాయి.
చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఈ ఏకగ్రీవాలను రకరకాల కారణాలతో సమర్థించుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ... ఏపీలోని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఈ అరాచకాలను ఏమాత్రం ఆమోదించడం లేదు. రాయలసీమ, పల్నాడు, ఇతర ప్రాంతాల్లో పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేసిన అక్రమాలను, బెదిరింపులను ప్రజలు కళ్లకు కట్టినట్టు వివరించారు.
జనం ఏమంటున్నారు?
అధికారపక్షం చేసిన ఈ అక్రమాలకు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బుద్ధి చెప్తామని ప్రజలు కులాలు, మతాలకు అతీతంగా తమ మనోభావాలను బహిరంగంగానే వ్యక్తపరిచారు. కరడుగట్టిన తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీకి వ్యతిరేకం. ఇది ఎన్టీరామారావు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కాదు, ఇది లోకేశ్ తెలుగుదేశంలో ఇవన్నీ అరాచకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. నారా లోకేశ్ రెడ్ బుక్ ప్రస్థావన కూడా ప్రజలు హర్షించడం లేదు.
నిజానికి టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఆక్రమాలు, దౌర్జన్యాలు సృష్టించి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడకపోయినా... సాధారణంగా ఎన్నికలు జరిగి ఉంటే కూటమి అత్యధికంగా 70 శాతానికి పైగా స్థానాలను సునాయాసంగా గెలుపొందేది. 2029 ఎన్నికల్లో అసలు అభిప్రాయం వ్యక్తం చేస్తాము, అప్పటి వరకు జరిగే అన్ని ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపించుకుంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆభిప్రాయం అత్యధిక శాతం మంది వ్యక్తం చేశారు.
వింత వాదనలు
{{/usCountry}}నిజానికి టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఆక్రమాలు, దౌర్జన్యాలు సృష్టించి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడకపోయినా... సాధారణంగా ఎన్నికలు జరిగి ఉంటే కూటమి అత్యధికంగా 70 శాతానికి పైగా స్థానాలను సునాయాసంగా గెలుపొందేది. 2029 ఎన్నికల్లో అసలు అభిప్రాయం వ్యక్తం చేస్తాము, అప్పటి వరకు జరిగే అన్ని ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపించుకుంటే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆభిప్రాయం అత్యధిక శాతం మంది వ్యక్తం చేశారు.
వింత వాదనలు
{{/usCountry}}ఈ అరాచకాలను సమర్థించుకోవడానికి చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తున్నారు. 2021లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, బలవంతపు ఏకగ్రీవాలకు ఇది ప్రతిస్పందన మాత్రమే అని చెప్తూ... నేటి అక్రమాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2019 నుండి 2024 వరకు వైఎస్సార్సీపీ సాగించిన అరాచకాలు, ప్రజా వ్యతిరేక పాలన, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన అక్రమ ఏకగ్రీవాలకు వ్యతిరేకంగానే కదా 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమిని మహత్తరమైన మెజారిటీతో గెలిపించింది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారని నమ్మి ఓటేస్తే, కూటమి ప్రభుత్వం కూడా అదే రౌడీయిజం, అదే అరాచకాల బాటలో నడవడాన్ని సామాన్య ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా, ఏపీ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల తీరును చూసి దొందూ దొందే అనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారు.
కొత్త రక్తం కావాలి
కుప్పం నుండి ఇచ్చాపురం వరకు పీపుల్స్ పల్స్ బృందం విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రజల నుంచి ఆంధ్రప్రదేశ్‌ను ఇక ఏ శక్తి బాగు చేయలేదు... తెలుగుదేశం, వైఎస్సార్సీపీ రెండు పార్టీలకూ సమాధి కట్టి, కొత్త రక్తంతో, నూతన ఉత్తేజంతో ఒక కొత్త పార్టీ వస్తే తప్ప ఈ రాష్ట్రానికి గత్యంతరం లేదు అనే అభిప్రాయానికి దాదాపు 90 శాతం మంది ప్రజలు రావడం గమనార్హం.
‘‘మా కర్మ కాలి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. టీడీపీ, వైసీపీ తప్ప మరో బలమైన పార్టీ లేకపోవడం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పెద్ద దౌర్భాగ్యం. చివరకు ఏపీలో మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సమాజం కూడా కులాల పరంగా విడిపోయి బానిసలుగా మారిన స్థితి ఉనికిలోకి వచ్చింది. దీని వల్ల రాష్ట్రం రోజురోజుకూ భ్రష్టు పట్టిపోతోంది’’ అని ప్రజలు తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చేసిన ఘాటు వ్యాఖ్యలపై కూడా అనేక చోట్ల ప్రజలు స్పందిస్తూ... ‘‘ఆయన చెప్పింది నూరుపాళ్లు నిజమే, ఇది ఖచ్చితంగా మా దౌర్భాగ్యమే’’ అని నిట్టూర్చారు.
ప్రతీకార రాజకీయాలను అసహ్యించుకుంటున్న జనం
మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడుతున్న మాటలు, ప్రవర్తిస్తున్న తీరు పట్ల కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అసహ్యం వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన బహిరంగ సభల్లో ఉపయోగించే రప్పా... రప్పా... చొక్కా మడతా పెడతాం, మేం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాలు దాటి ఎక్కడ దాక్కున్నా ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ల అంతు చూస్తాం అంటూ చేస్తున్న ప్రసంగాలను, ప్రతీకార రాజకీయ వైఖరిని సాధారణ ఏపీ ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. దీనికి తోడు, తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని ప్రతినబూని సభకు రాకుండా మొండికేస్తున్న వైఎస్ జగన్ ప్రకటనను ప్రజలు అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఆశకు హద్దు ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదని ప్రజలు హితవు పలుకుతున్నారు.
జగన్, షర్మిలా ఆస్తి తగదాల గురించి కూడా క్షేత్రస్థాయిలో ఎవరూ మాట్లాడం లేదు, మీడియాలో ప్రచారం తప్పా ఇంకేమీ లేదు. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. అటువంటిది 2024 ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత తీవ్రమైన అత్యాశకు పోయి, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా 175 సీట్లకు 175 గెలవాలి అని వీధివీధినా పిలుపునిచ్చారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పునిచ్చారు. అంతటి ఘోర పరాజయం తర్వాత కూడా వైఎస్సార్సీపీ అధినేత తమకు 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని ఆత్మపరిశీలన చేసుకోకుండా, ఇప్పటికీ తన విధ్వంసకర పంథాను మార్చుకోకుండా అదే నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను రావణ కాష్టంగా మారుస్తున్నారని ప్రజలు చెప్పారు.
2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనా కాలంలో సాగిన వైఖరులతో విసిగి వేసారిన ప్రజలు, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 23 సీట్లే కట్టమెట్టి షాక్ ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుండి అంత ఘోర ఓటమిని ఆ పార్టీ ఎప్పుడూ చూడలేదు. అదే రీతిలో, 2019 నుంచి 2024 వరకు సాగిన వైఎస్సార్సీపీ నియంతృత్వ పాలనను అసహ్యించుకుని 2024లో ఆ పార్టీకి 11 సీట్లే ఇచ్చి దారుణ పరాభవాన్ని రుచి చూపించారు. 2019లో టీడీపీ, 2024లో వైఎస్సార్సీపీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ, ఈ రెండు పార్టీల అధినేతలకు జ్ఞానోదయం కలగడం లేదు! ఇద్దరూ మళ్లీ మళ్లీ అవే తప్పులను, అదే కక్షసాధింపు రాజకీయాలను పునరావృతం చేస్తున్నారు.
ప్రజాసమస్యలపై ఆగ్రహం
క్షేత్రస్థాయిలో పీపుల్స్ పల్స్ బృందం పర్యటిస్తున్నప్పుడు ప్రజలు కులాలు, మతాలకు అతీతంగా ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి అవకాశాల లేమి గురించి ఆగ్రహాం వ్యక్తంచేశారు. ప్రజలను నిత్యం వేధిస్తున్న ఈ ప్రధాన సమస్యలపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఏ రోజూ నోరు మెదపదు! మరోవైపు అధికార కూటమి నేతలు కూడా ఈ ధరల పెరుగుదల, ఉపాధి సమస్యలను పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తెచ్చామని గొప్పగా చెప్తున్నప్పటికీ...ఏ ఊరిలోనూ తమకు కూటమి వచ్చాక ఒక ఉద్యోగం వచ్చిందని చెప్పడం లేదు. పెట్టుబడులు వచ్చాయనీ చెప్పడం లేదు. ఇవన్నీ కాగీతాలకు, ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. ఇరుపక్షాల నేతలూ కేవలం ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు, రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమవుతూ ప్రజల బాగోగులను పూర్తిగా అటకెక్కించాని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
నూతన రాజకీయ శక్తి కోసం నిరీక్షణ
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ నిజంగా పెరగాలన్నా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా... కక్షసాధింపులు, అరాచకాలకు నిలయంగా మారిన ఈ రెండు ప్రధాన పార్టీలకు సమాధి కట్టి, కొత్త ఆలోచనలతో నూతన రాజకీయ శక్తి ఆవిర్భవించాలనే ఆకాంక్ష ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఈ ప్రజాకాంక్ష బలపడితే, రాబోయే 2029 ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన పార్టీలను ప్రజలు తిరస్కరించడం ఖాయం. అధికార కూటమి నాయకత్వం, ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఇప్పటికైనా కళ్లు తెరవాలి. తమ వైఖరిని మార్చుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల అసలు సమస్యలపై దృష్టి సారిస్తూ ముందుకు వెళ్తేనే ఈ పార్టీలకు భవిష్యత్తు ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూసి కూటమి పార్టీలు చంకలు గుద్దుకోకుండా... తాము ఉన్న ఎకో చాంబర్ లో నుంచి బయటకు వచ్చి... క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోని పక్షంలో 2029 ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదు. కూటమి పార్టీలు సింగిల్ డిజిట్ కి పరిమితమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఆర్. దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ
(గమనిక: ఈ వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు రచయితవి, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థవి మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు.)