AP University Recruitment 2026 : ఏపీ యూనివర్శిటీల్లో 1,523 ఉద్యోగాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు
AP Universities Faculty Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించారు. ఇప్పటివరకు 1.62 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి.
AP Universities Faculty Recruitment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో (యూనివర్సిటీలు) ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉన్నత విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఈ పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మొదట ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం సోమవారంతోనే(జూన్ 8) ఈ గడువు ముగిసిపోయింది. అయితే…. సాంకేతిక కారణాలు. సర్టిఫికెట్ల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా గడువు పెంచాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. నిరుద్యోగ అభ్యర్థుల అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం…. ఈ నెల (జూన్) 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి అవకాశం కల్పించింది.
సవరించిన పూర్తి షెడ్యూల్ వివరాలు:
తాజా ఉత్తర్వుల ప్రకారం…. ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూన్ 15తో ముగియనుంది. దరఖాస్తు చేసుకున్న అనంతరం, దానికి సంబంధించిన పూర్తి వివరాలు.విద్యార్హతల ధ్రువపత్రాల హార్డ్ కాపీలను (Hard Copies) వర్సిటీలకు పంపాల్సి ఉంటుంది. ఈ హార్డ్ కాపీల సమర్పణకు ఈ నెల 22వ తేదీ వరకు సమయమిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం…. అర్హులు మరియు అనర్హుల ప్రాథమిక జాబితాను ఈ నెల 29న అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
ఈ జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు జులై 6వ తేదీ వరకు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చు. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను జూలై 7న విడుదల చేస్తామని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది.
పోస్టుల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు
రాష్ట్రంలోని వివిధ వర్సిటీలలో ఉన్న ప్రొఫెసర్ ఖాళీలకు నిరుద్యోగులు భారీగానే దరఖాస్తు చేసుకుంటున్నారు. అన్నిరకాల అధ్యాపక పోస్టులకు కలిపి ఇప్పటివరకు మొత్తం 1,62,808 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పోస్టుల వారీగా చూస్తే:
- సహాయ ఆచార్య (అసిస్టెంట్ ప్రొఫెసర్): అత్యధికంగా 1,42,683 దరఖాస్తులు వచ్చాయి.
- అసోసియేట్ ప్రొఫెసర్: ఈ పోస్టులకు 9,187 మంది పోటీ పడుతున్నారు.
- ప్రొఫెసర్: ఉన్నత స్థాయి పోస్టులైన వీటికి 1,417 దరఖాస్తులు అందాయి.
- ఆర్జీయూకేటీ (RGUKT) లెక్చరర్లు: ట్రిపుల్ ఐటీల్లో లెక్చరర్ల పోస్టుల కోసం 9,521 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పోటీని గమనిస్తే, రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అత్యధికంగా 21,720 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాతి స్థానాల్లో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి (SVU) 15,546, ఆర్జీయూకేటీకి 11,568, జేఎన్‌టీయూ-అనంతపురానికి 11,351, అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి (SKU) 10,614 దరఖాస్తులు అందాయి.
హోదాల వారీగా ఖాళీల వివరాలు:
- ప్రొఫెసర్: 63 (రెగ్యులర్: 63, బ్యాక్‌లాగ్: 0)
- అసోసియేట్ ప్రొఫెసర్: 334 (రెగ్యులర్: 191, బ్యాక్‌లాగ్: 143)
- అసిస్టెంట్ ప్రొఫెసర్: 1,020 (రెగ్యులర్: 886, బ్యాక్‌లాగ్: 134)
- లెక్చరర్ (కేవలం RGUKTలో): 104 (రెగ్యులర్: 104, బ్యాక్‌లాగ్: 0)
- అసిస్టెంట్ లైబ్రేరియన్: 2 (రెగ్యులర్: 0, బ్యాక్‌లాగ్: 2)
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నియామకాల కోసం ఒకే ఒక కామన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను ( https://apuniversitiesrecruitment.apcfss.in ) అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు ఈ సింగిల్ విండో పోర్టల్‌లో ఒక్కసారి తమ వివరాలను నమోదు చేసుకుని, మల్టీ-యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఆప్షన్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, భవిష్యత్ సంప్రదింపులన్నీ ఈ స్మార్ట్ పోర్టల్ ద్వారానే సాగుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

