APSRTC : ఇంటి వద్దకే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు.. ప్రయణికుల కోసం సరికొత్త విధానం!
APSRTC : ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన విధానాన్ని తీసుకువస్తోంది. అందులో భాగంగా మీ ఇంటి వద్దకే ఏపీఎస్ఆర్టీసీ బస్సు రానుంది. దీంతో బస్టాండుకు వెళ్లాల్సిన తిప్పలు తప్పుతాయి.
ప్రయాణికులను ఆకట్టుకోవడంతో పాటు వారికి మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఒక సరికొత్త వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లకు బస్టాండ్‌కు వెళ్లే తిప్పలు తప్పిస్తూ, నేరుగా వారి ఇంటి వద్ద నుంచే ఆర్టీసీ బస్సు ఎక్కే వెసులుబాటును కల్పించబోతోంది.

సాధారణంగా సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ వంటి అగ్రశ్రేణి (హైయ్యండ్) బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, నిర్ణీత సమయానికంటే ముందే లగేజీతో బస్టాండ్‌కు చేరుకోవడం ప్రయాణికులకు పెద్ద శ్రమతో కూడుకున్న పని. ముఖ్యంగా కుటుంబాలు, బంధువులు లేదా స్నేహితుల బృందాలు ప్రయాణిస్తున్నప్పుడు లగేజీతో సమయానికి బస్టాండ్‌కు రావడం తీవ్ర ఇబ్బందిగా మారుతోంది.
ఈ సమస్యను గుర్తించిన ఆర్టీసీ అధికారులు బల్క్ బుకింగ్ విధానానికి ప్రాధాన్యతనిచ్చారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేసారి బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకుంటే, ఆర్టీసీ బస్సే స్వయంగా వారి ఇంటి వద్దకు వచ్చి ప్రయాణికులను పికప్ చేసుకునేలా సరికొత్త వెసులుబాటును అందుబాటులోకి తెస్తున్నారు.
ఈ వినూత్న పికప్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ముందుగా విజయవాడ నగర పరిధిలో అమలు చేయాలని విజయవాడ రీజియన్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. విజయవాడలో సాధించే ప్రగతి, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించాలని ఆర్టీసీ భావిస్తోంది.
హైయ్యండ్‌కు చెందిన సూపర్ లగ్జరీ, ఏసీ గరుడ, నైట్ రైడర్, స్లీపర్ బస్సులలో ప్రయాణించే వారు 10 అంతకంటే ఎక్కువ టికెట్లను బల్క్ బుకింగ్ చేసుకున్న తర్వాత, ఆ సమాచారాన్ని ముందస్తుగా ఆర్టీసీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం దీనికోసం ప్రత్యేకంగా ఒక కొత్త డిజిటల్ లేదా కాల్ ఆధారిత వ్యవస్థను రూపుదిద్దుతున్నారు. ఈ కసరత్తు పూర్తయిన వెంటనే పూర్తి విధివిధానాలు, నిబంధనలను ఆర్టీసీ అధికారికంగా వెల్లడించనుంది.
ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దూరప్రాంత ప్రయాణికులు, కుటుంబ సమేతంగా ప్రయాణించే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు, టాక్సీల ఛార్జీల భారం తగ్గడమే కాకుండా సకాలంలో ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఈ సేవలు ఎంతో దోహదపడనున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


