తెలుగు సినిమా, సాహిత్యం చాటిచెప్పేలా ఈ తేదీల్లో ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం
తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవాన్ని ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు వివరాలను మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్ విభాగంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి, టీమ్‌వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శ్యామ్‌తో కలిసి ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవంపై పలు అంశాలను వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2026 జనవరి 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దార్శనికతలో భాగంగా ఈ ఉత్సవం రూపుదిద్దుకుందన్నారు. కేవలం ఇండోర్ హాల్స్‌కే పరిమితం కాకుండా, బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం దీని ప్రత్యేకతగా మంత్రి పేర్కొన్నారు.
తెలుగు కథలు, సినిమాలకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, అమరావతి-విజయవాడ ప్రాంతాన్ని ఒక సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడమే ఈ పండుగ లక్ష్యమని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, స్థానిక కళాకారులకు, కళాభిమానులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఒకే బహిరంగ వేదికపైకి తెచ్చి ఆంధ్రప్రదేశ్‌ను సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశం ఉచితం అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం, ప్రజా సంబంధాలను మెరుగుపరచడంలో సంస్కృతిని ఒక బలమైన పిల్లర్‌గా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు 'ఆవకాయ్' ప్రతిరూపమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సినిమా, సాహిత్యం, సంగీతం, కళా ప్రదర్శనలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా మన కళా సంప్రదాయాల లోతును చాటిచెబుతూనే సమకాలీన సృజనాత్మకతను తాము గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ ఒక గొప్ప సాంస్కృతిక గమ్యస్థానంగా ఎదగడానికి, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఉత్సవం ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధునాతన, ప్రాచీన కళలను ప్రపంచానికి తెలియచెప్తామన్నారు . అమరావతిని సాహితీ, కళా రాజధానిగా తయారు చేసే క్రమంలో ఈ కార్యక్రమం తొలిమెట్టుగా భావిస్తున్నామన్నారు.
ఈ వారంలో మొదట సినిమాటోగ్రఫీ, హోంశాఖ నేతృత్వంలో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. ఉన్నతాధికారుల సమావేశం తర్వాత సినీ ప్రముఖులతో సమావేశం అవుతామన్నారు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
ప్రజా భాగస్వామ్యంతో అనుసంధానించే సమగ్ర సాంస్కృతిక చొరవగా ఆవకాయ్‌ను తీర్చిదిద్దామని పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. నదీ తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యక్రమం చర్చలు, ప్రదర్శనలు, అభ్యాసాలను అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుందన్నారు.
సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలతో కూడిన పలు కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, సృజనాత్మక బలాన్ని ప్రదర్శించడానికి ఆవకాయ్ రూపొందించబడిందని ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి అన్నారు. నదీతీర నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతూ, వైవిధ్యభరితమైన ప్రేక్షకులను ఈ ఉత్సవం భాగస్వాములను చేస్తుందన్నారు.
మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో భాగంగా తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు జరుగుతాయి. కవిత్వం, ముషాయిరా (తెలుగు, ఉర్దూ), నృత్యం, సంగీతం, థియేటర్లపై , తోలుబొమ్మలాట, నృత్యం, సంగీతం, నాటకరంగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. హెరిటేజ్ వాక్ (వారసత్వ యాత్రలు), ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, రుచికరమైన స్థానిక వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












