వచ్చే నెలలో భోగాపురం విమానాశ్రయం ట్రయల్ రన్ ప్రారంభం
ఉత్తరాంధ్ర వాసుల కల అయిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ విమానాశ్రయం ట్రయల్ రన్ వచ్చే నెలలో ప్రారంభించనున్నట్టుగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పల నాయుడుతో కలిసి మంత్రి విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిని అంచనా వేశారు. ఉత్తర ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి మీడియాతో అన్నారు. కొన్ని 5 స్టార్ హోటళ్ళు కూడా వస్తున్నాయన్నారు.

'స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించడమే మా లక్ష్యం. ఈ ప్రాంతంలో అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. టాక్సీవేలు, రన్‌వేలు త్వరగా, నాణ్యతతో అభివృద్ధి అవుతున్నాయి. భోగాపురం నుండి విమానాలను ప్రారంభించడానికి కొన్ని విమానయాన సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి.' అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఈ కొత్త సౌకర్యంలో ఇండిగో తమ హబ్‌ను ఏర్పాటు చేయాలని రామ్మోహన్ నాయుడు కోరారు. వచ్చే వారం విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విమానయాన సంబంధిత కంపెనీలను తమ మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ప్రధాన మంత్రి మోదీని ఆహ్వానిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం, భోగాపురంలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
'ప్రాజెక్టు ఇప్పటివరకు 91.7 శాతం పూర్తయినందుకు సంతోషంగా ఉంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి, వాణిజ్యానికి, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా మారనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేసి దేశానికి అంకితం చేయడానికి కట్టుబడి ఉన్నాం.' అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మెుదటి దశలో రూ.4,592 కోట్ల వ్యయంతో 22 ఏరో బ్రిడ్జ్‌లు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తారు. 2203 ఎకరాల్లో విమనాశ్రయం విస్తీర్ణం పూర్తి చేస్తారు. ఇతర అవసరాలకు కూడా ప్రభుత్వం మరో 500 ఎకరాలను కేటాయించింది. ఒక్కొటి 3.8 కిలో మీటర్ల పొడవుతో రెండు రన్ వేలు నిర్మిస్తున్నారు. రెండో దశ పనులు తర్వాత జరగనున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


