ఏపీ : ఇవాళ్టి నుంచి 'సదరం' స్లాట్ల బుకింగ్ పునఃప్రారంభం - ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగానే సేవలు..!
రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ' సదరం' స్లాట్ల బుకింగ్ పునఃప్రారంభం కానుంది. డిసెంబరు వరకు కొనసాగిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.తొలిసారిగా ఉచిత సేవలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
దివ్యాంగుల కోసం 'సదరం' కింద స్లాట్ల బుకింగ్ ఈనెల 14 నుంచి (శుక్రవారం) నుంచి పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలను వెల్లడించారు. సాంకేతిక కారణాలతో గత సెప్టెంబరు నెలాఖరు నుంచి నిలిచిన స్లాటు బుకింగ్ లు శుక్రవారం నుంచి ప్రారంభించి, డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగిస్తామని తెలిపారు.

ఉచితంగానే సేవలు…
ఇప్పటికే నిరీక్షణ జాబితా (వెయిటింగ్ లిస్టు)లో వేచి ఉన్న సుమారు 10 వేల మందికి స్లాటు బుకింగ్ ఖరారులో తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఆ తరువాత కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి స్లాట్లు (తేదీ, సమయం) ఇస్తామని మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్‌కు రూ.40, జారీ చేసిన సర్టిఫికెట్ ముద్రణకు రూ.40 చొప్పున ఫీజులు వసూలు చేసేవారు. దివ్యాంగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఫీజులు తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు.
సదరం కింద సామాజిక ఆసుపత్రుల్లో ప్రతి సోమవారం, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రుల్లో ప్రతి మంగళవారం దివ్యాంగులకు వైద్యుల ద్వారా వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. దీని ప్రకారం డిసెంబరు నెలాఖరునాటికి 31,050 మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తామని తెలిపారు. ఇంతకుముందు 112 ఆసుపత్రుల్లో పరీక్షలు జరపగా.. ఈ సారి అదనంగా మరో ఆరు ఆసుపత్రులను ఈ జాబితాలో చేర్చామని వెల్లడించారు.
వైద్యుల అందుబాటుకు అనుగుణంగా అసుపత్రులను ఖరారు చేసినట్లు చెప్పారు. కాళ్లు, చేతుల సమస్యలు (లోకోమోటర్), కంటి చూపు మందగించడం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మందబుద్ధిలోపం కేటగిరిల్లో దరఖాస్తుదారులకు ఉన్న వైకల్య శాతాన్ని అనుసరించి వైద్యులు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. వీటికి అనుగుణంగా పింఛన్, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత లభిస్తుంది.
వారికి కూడా పరీక్షలు…
గతంలో వైకల్యం తక్కువగా నిర్ధారణ అయిన వారికి అప్పీల్ అవకాశాన్ని కల్పించగా 1,04,000 మంది అప్పీల్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 19,235 మందికి తిరిగి పరీక్షలు జరిపారు. మిగిలిన వారికి కూడా పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో జరుగుతాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ (డియస్‌హెచ్) కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. డిసెంబరు నెలాఖరు నాటికి అప్పీల్ చేసుకున్న వారందరికీ పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
పింఛన్ పొందే వారిలో మిగిలిన 1.87 లక్షల మందికి రీ-అసెస్ మెంట్ పరీక్షలు జరపాల్సి ఉందని డియస్‌హెచ్ చక్రధర్ బాబు తెలిపారు. వీరికి జనవరి నుంచి రీ-అసెస్ మెంటు పరీక్షలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

