Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు రూ.300 కోట్లు విడుదల - నీటి విడుదలపై సీఎం కీలక ప్రకటన
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం అందింది. యర్రగొండపాలెంలో జరిగిన కార్యక్రమంలో 2,351 నిర్వాసిత కుటుంబాలకు రూ. 300 కోట్ల పునరావాస ప్యాకేజీ నిధులను సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు.
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం నిధులు విడుదలయ్యాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శనివారం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు.

నిధులు విడుదల….
వెలిగొండ ప్రాజెక్ట్ కారణంగా భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు రూ. 300 కోట్ల ఆర్ అండ్ ఆర్ (పునరావాసం - స్థిరనివాసం) నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ నిర్ణయంతో మార్కాపురం జిల్లా పరిధిలోని 2,351 నిర్వాసిత కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ఈ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ కోసం సర్వస్వం త్యాగం చేసిన 2,351 నిర్వాసిత కుటుంబాల ఖాతాల్లోకి రూ. 300 కోట్లు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేసుల, చింతలముడిపి, కాటమరాజు తండా, సాయిరామ్ నగర్ తదితర ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఈ నిధులను అందిస్తున్నాం," అని ప్రకటించారు.
జూలై 31 నాటికి నీటి విడుదల
వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి, లక్ష్యాలపై చంద్రబాబు స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ నాటికి వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి విడత (ఫేజ్-1) ద్వారా నీటిని విడుద చేస్తామన్నారు. మొదటి దశ పూర్తి కావడం వల్ల 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు….. 4 లక్షల మంది దాహార్తి తీరుతుందని చెప్పారు. ఇక రెండో దశ (ఫేజ్-2) పనులు పూర్తయితే మరో 3.20 లక్షల ఎకరాలు పచ్చబడుతుందని, 11.20 లక్షల మందికి తాగునీటి కష్టాలు తప్పుతాయని వివరించారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మొత్తం రూ. 10,580 కోట్లు అవసరమవుతాయని సీఎం వివరించారు. అందులో ఇప్పటివరకు రూ. 6,736 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సంపూర్ణంగా పూర్తి కావడానికి ఇంకా రూ. 3,844 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…. ఈ ప్రాజెక్ట్ వేగాన్ని పెంచడానికి రూ. 759 కోట్లు ఖర్చు చేసిందని, అలాగే నిర్వాసితుల కోసం రూ. 905 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ మంజూరైన నిధుల్లోంచే శనివారం తొలి విడతగా రూ. 300 కోట్లను విడుదల చేసినట్లు స్పష్టం చేశారు.
మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని వెనుకబడిన ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్ట్ ఒక సంజీవని లాంటిదని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాలుగు జిల్లాల పరిధిలోని 30 మండలాలకు చెందిన లక్షలాది మందికి సాగు, తాగునీరు అందుతుందన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

