రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. గురువారం సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
కేంద్రమంత్రులతో భేటీలు…

శుక్రవారం వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో భేటీ అవుతారు.
కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు. తిరిగి శుక్రవారం రాత్రి అమరావతి చేరుకుంటారు. శనివారం అనకాపల్లి జిల్లాలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు.
22ఏ భూములపై సీఎం చంద్రబాబు ఆదేశాలు:
మరోవైపు రెండో రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భూ వివాదాలపై కీలక చర్చ జరిగింది. 22ఏ భూములపై సమీక్షించిన సీఎం చంద్రబాబు… 22ఏ భూముల వివాదాల పరిష్కారానికి హై ప్రయార్టీ ఇవ్వాలని సూచించారు. *వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో 22ఏ భూముల వివాదాల పరిష్కారంపైనే మొదటి అజెండాగా చేపడతామని స్పష్టం చేశారు.
భూవివాదాల్లో పొలిటికల్ నేతల జోక్యాన్ని ఎంత మాత్రమూ సహించొద్దని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. *భూవివాదాల్లో రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ గ్రీవెన్సులు త్వరితగతిన పరిష్కరించాలని… అన్ని రిజిస్ట్రేషన్ అండ్ ఆస్తి పత్రాలు డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతోందని వివరించారు. లింక్ డాక్యుమెంట్సు డేటా వేర్ హౌసింగ్‌లో పెడుతున్నామని పేర్కొన్నారు. 22 ఏ భూముల విషయంలో సర్వే చేసి సెటిల్ చేయాలని...జాయింట్ ఎల్పీఎం భూముల విషయంలో నిర్దేశిత గడువులోకా పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు.