VB G-RAM-G Scheme : ఏపీ నుంచి దేశవ్యాప్తంగా ‘వీబీజీ రామ్ జీ’ పథకం ప్రారంభం... ఏపీకి రూ.7,700 కోట్ల కేంద్ర నిధులు!
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ‘వీబీ జీ రామ్ జీ’ ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు.
VB G-RAM-G scheme : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రక ఘట్టానికి తిరుపతి జిల్లా రైల్వేకోడూరు వేదికైంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్’ పథకాన్ని ఏపీ నుంచి ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది.

ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనుల్ని ముగ్గురు నేతలూ లాంఛనంగా ప్రారంభించారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్దిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు కలిసి వీబీజీ రామ్ జీ జాబ్ కార్డులను అందజేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ లు వీబీ జీ రామ్ జీ ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు.
చారిత్రాత్మక ఘట్టం - సీఎం చంద్రబాబు
ఈ పథకం కింద సమాచార బుక్ లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడుదల చేశారు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజివికా మిషన్ పోర్టల్ ను నేతలు ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...." వీబీ జి రామ్ జీ పథకం ఏపీలోని రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావటం చారిత్రాత్మకం. గతంలో నరేగా రాయలసీమ ప్రాంతం నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్ జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతం అయ్యింది. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్రం మరో రూ.4 వేల కోట్ల వ్యయంతో వీబీజీ రామ్ జీ కింద పనులు చేపడతాం" అని చెప్పారు.
జల్ జీవన్ మిషన్ సహా 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత పాలకులు నిర్వీర్యం చేస్తే వాటిని తిరిగి పునరుద్ధరించామని సీఎం అన్నారు. రూ.28 వేల కోట్లతో వివిధ పథకాలు చేపడుతున్నామని.. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెడతామని చెప్పి రెండేళ్లలో మాట నిలుపుకున్నామని వివరించారు. సీఎం మాట్లాడుతూ “కేంద్రం అమరావతికి సహకారం అందించింది. వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతోంది. ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికలు అయ్యాక మరో మాట మాట్లాడారు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పాట పాడుతున్నారు. ఇది ఎవరికైనా అర్ధం అయ్యిందా. అమరావతిని ఆపటం ఎవరి తరమూ కాదు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం” అని వివరించారు.
ఏపీకి నేను మేనమామ - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
సీఎం చంద్రబాబుతో కలిసి వీబీ జీ రామ్ జీ పథకం ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకే వీబీజీ రామ్ జీ కింద రూ.7.5 లక్షల కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఏపీకి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. స్వయంగా గ్రామ సభలే పంచాయితీలో పనుల్ని నిర్దేశించుకుంటాయని తెలిపారు. తనను మధ్యప్రదేశ్ లో అంతా మామాజీ అని పిలుస్తారని.. ఇప్పుడు ఏపీకి కూడా తాను మేనమామనే అయ్యానని మంత్రి వ్యాఖ్యానించారు. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడని.. ఏపీకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్ల నిధులు ఇవ్వనున్నట్టు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

