'సత్యసాయి సేవామార్గానికి ప్రతిరూపంగా నిలిచారు.. ప్రపంచానికి ప్రేమను పంచారు'
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవలను గుర్తు చేసుకున్నారు.
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్‌వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఉపరాష్ట్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు.

సేవా మార్గంలో నడిపించారు
సత్యసాయి సేవామార్గానికి ప్రతిరూపంగా నిలిచారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. ఆయన ప్రపంచం మెుత్తం ప్రేమను పంచారని గుర్తు చేశారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించారన్నారు. అనేక మందిని సేవా మార్గంలో నడిపించారని చెప్పారు. ఎంతోమందికి సత్యసాయి తాగునీరు అందించారని తెలిపారు. 'ప్రపంచ దేశాల్లో సత్యసాయి ట్రస్టు సేవలు అందిస్తోంది. లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. సత్యసాయి అనేక వైద్యాలయాలు స్థాపించి పేదలకు వైద్యం అందించారు. తమిళనాడులో తాగునీటి సదుపాయం కల్పించారు.' అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు.
లక్ష్యం కోసం అవతరించారు
ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యసాయి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారని, దానికోసమే జీవించారన్నారు. మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారన్నారు. తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారన్నారు చంద్రబాబు. క్రమశిక్షమ, ప్రేమ, సేవాభావం గురించి చెప్పారన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలుగా కొత్త అధ్యాయం ప్రారంభించారన్నారు. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీసత్యసాయి అని చంద్రబాబు అన్నారు.
'శ్రీసత్యసాయి తన మహిమలతో అన్ని మాతలు ఒక్కటేనని నిరూపించారు. అందరి సంక్షేమాన్ని కోరుకున్నారు. అనేక దేశాల అధినేతలువచ్చి ఆయనను దర్శించుకున్నారు. సాయి సిద్ధాంతం ప్రపంచం అంతా వ్యాపించింది. సత్యసాయిబాబా ట్రస్టు ద్వారా సేవలను ప్రపంచవ్యాప్తం చేశారు. 102 సత్యసాయిబాబా పాఠశాలల్లో 60 వేల మంది చదువుతున్నారు. ట్రస్టు ఆసుపత్రుల ద్వారా రోజుకు మూడు వేల మందికిపైగా రోగులకు చికిత్స అందుతోంది. రూ.550 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల దాహార్తి తీర్చడానికి నీరు అందించారు.' అని చంద్రబాబు అన్నారు.
మనుషుల్లో దేవుడిగా
సత్యసాయి మనుషుల్లో దేవుడిగా శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సత్యసాయి మానవ సేవే మాధవ సేవ అని బోధించారని, దానిని అమలు చేశారన్నారు. విద్య, వైద్యం, తాగునీటి సమస్యలను పరిష్కారించారన్నారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరేందుకు అవసరమైన ధైర్యాన్ని అందించారన్నారు. 140 దేశాల్లో సత్యసాయిబాబాకు భక్తులు ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
'ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారు. ప్రేమతో మనుషులను గెలిచారు. సత్యసాయి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయి ట్రస్టు నెరవేర్చింది. పేదలకు విద్య అందించారు, సరైన వైద్యం ఇచ్చారు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.













