Kurnool road accident : కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు.వీరిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.
ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు… మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
ప్రాథమిక వివరాల ప్రకారం.. సుమారు 16 మంది భక్తులతో కూడిన గూడ్స్ వాహనం మంత్రాలయం వైపు వెళ్తోంది. చిలకలడోన ప్రాంతానికి చేరుకోగానే వేగంగా వచ్చిన ట్యాంకర్ వీరి వాహనాన్ని నేరుగా ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి భక్తులు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జయ్యింది.
"ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాం. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించాం" అని ఎమ్మిగనూరు డీఎస్పీ ఎన్. భార్గవి వివరించారు.
ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మిగిలిన ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో మంత్రాలయం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వెళ్తున్న వారు ఇలా రోడ్డు ప్రమాదానికి గురికావడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.