డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా తీర సమీపంలో వీరంతా క్షేమంగా ఉన్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు (AD) రమణారావు అధికారికంగా స్పష్టం చేశారు. దీంతో గడిచిన 20 రోజులుగా రోదనలతో నిండిన ఆ మత్స్యకార కుటుంబాల్లో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి.

ఈనెల 3వ తేదీన అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. సాధారణంగా కొన్ని రోజుల్లో తిరిగిరావాల్సిన వారు.. రోజులు గడుస్తున్నా ఇంటికి చేరుకోకపోవడంతో పాటు, వారితో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా తెగిపోయింది. సముద్రంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం, ఇంజిన్ వైఫల్యం లేదా బలమైన ఈదురుగాలుల వల్ల బోటు కొట్టుకుపోయి ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
తీరంలో ఉన్న వారి భార్యలు, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు రోజూ సముద్రం వైపు చూస్తూ కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధి కోసం వెళ్లిన కుటుంబ పెద్దలు తిరిగి వస్తారో లేదోనన్న భయం ఆ ఇళ్లను గుప్పిట్లోకి తీసుకుంది. మత్స్యకారుల గల్లంతు వార్తతో కలవరపడిన ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈనెల 17వ తేదీ నుంచి ఏకధాటిగా 10 రోజుల పాటు అలుపెరగని శోధన సాగింది. హెలికాప్టర్లు, నౌకల ద్వారా లోతైన సముద్రంలో గాలింపు చేసింది.
తీరప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల కోస్టల్ పోలీసులతో నిరంతర సమన్వయం చేసింది ప్రభుత్వం. అయితే అలల ఉధృతికి కొట్టుకుపోయిన ఆ మత్స్యకారుల బోటు కోల్‌కతా సమీపంలో సురక్షితంగా ఉన్నట్లు కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించారు. ఆ ఏడుగురు మత్స్యకారులు ప్రస్తుతం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని అధికారి రమణారావు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ అధికారులతో మాట్లాడి, వారిని తిరిగి కోనసీమలోని స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు వేగవంతం చేశారు. తమ వారు ప్రాణాలతో ఉన్నారన్న వార్త వినగానే ఓడలరేవు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దేవుడు మా ప్రార్థనలు విన్నాడు, మా కుటుంబాలకు మళ్లీ వెలుగులొచ్చాయి అంటూ వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}పశ్చిమ బెంగాల్ అధికారులతో మాట్లాడి, వారిని తిరిగి కోనసీమలోని స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు వేగవంతం చేశారు. తమ వారు ప్రాణాలతో ఉన్నారన్న వార్త వినగానే ఓడలరేవు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దేవుడు మా ప్రార్థనలు విన్నాడు, మా కుటుంబాలకు మళ్లీ వెలుగులొచ్చాయి అంటూ వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}