హమ్మయ్యా.. కోనసీమ నుంచి వెళ్లిన మత్స్యకారులు సేఫ్.. ఏడుగురి ఆచూకీ లభ్యం

కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ దొరికింది. పశ్చిమబెంగాల్‌లో సురక్షితంగా ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు.

Published on: Aug 26, 2026, 19:41:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా తీర సమీపంలో వీరంతా క్షేమంగా ఉన్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు (AD) రమణారావు అధికారికంగా స్పష్టం చేశారు. దీంతో గడిచిన 20 రోజులుగా రోదనలతో నిండిన ఆ మత్స్యకార కుటుంబాల్లో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈనెల 3వ తేదీన అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. సాధారణంగా కొన్ని రోజుల్లో తిరిగిరావాల్సిన వారు.. రోజులు గడుస్తున్నా ఇంటికి చేరుకోకపోవడంతో పాటు, వారితో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా తెగిపోయింది. సముద్రంలో అకస్మాత్తుగా మారిన వాతావరణం, ఇంజిన్ వైఫల్యం లేదా బలమైన ఈదురుగాలుల వల్ల బోటు కొట్టుకుపోయి ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

తీరంలో ఉన్న వారి భార్యలు, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు రోజూ సముద్రం వైపు చూస్తూ కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధి కోసం వెళ్లిన కుటుంబ పెద్దలు తిరిగి వస్తారో లేదోనన్న భయం ఆ ఇళ్లను గుప్పిట్లోకి తీసుకుంది. మత్స్యకారుల గల్లంతు వార్తతో కలవరపడిన ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈనెల 17వ తేదీ నుంచి ఏకధాటిగా 10 రోజుల పాటు అలుపెరగని శోధన సాగింది. హెలికాప్టర్లు, నౌకల ద్వారా లోతైన సముద్రంలో గాలింపు చేసింది.

తీరప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల కోస్టల్ పోలీసులతో నిరంతర సమన్వయం చేసింది ప్రభుత్వం. అయితే అలల ఉధృతికి కొట్టుకుపోయిన ఆ మత్స్యకారుల బోటు కోల్‌కతా సమీపంలో సురక్షితంగా ఉన్నట్లు కోస్ట్ గార్డ్ అధికారులు గుర్తించారు. ఆ ఏడుగురు మత్స్యకారులు ప్రస్తుతం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని అధికారి రమణారావు తెలిపారు.

పశ్చిమ బెంగాల్ అధికారులతో మాట్లాడి, వారిని తిరిగి కోనసీమలోని స్వస్థలాలకు సురక్షితంగా తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు వేగవంతం చేశారు. తమ వారు ప్రాణాలతో ఉన్నారన్న వార్త వినగానే ఓడలరేవు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దేవుడు మా ప్రార్థనలు విన్నాడు, మా కుటుంబాలకు మళ్లీ వెలుగులొచ్చాయి అంటూ వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More