ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మారుమూల ప్రాంతంలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి ఐడుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వెల్లడించారు. అనంతగిరి మండలం పినకోట గ్రామంలో ప్రస్తుతం రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ నిర్మాణ ప్రాంతం ప్రధాన నగరాలు, ఇంధన బంకులకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో వాహనాలకు అవసరమైన డీజిల్‌ను డ్రమ్ములలో సేకరించి…. నిల్వ ఉంచిన వాహనాల ద్వారా నిర్మాణ ప్రాంగణానికి తీసుకువస్తారు.
ఈ క్రమంలోనే శనివారం రోజున ఒక డంపర్ ట్రక్కులో డీజిల్ రీఫిలింగ్ (ఇంధనం నింపే) ప్రక్రియ చేపడుతుండగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. "ఇది ఎలాంటి పేలుడు కాదు. డీజిల్ నింపే సమయంలో కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇంధనం పోస్తున్న సమయంలో చిన్న నిప్పురవ్వ ఎగిసిపడి క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఉండవచ్చు" అని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మీడియాకు వివరించారు.
డంపర్ ట్రక్కులోకి డీజిల్ పోస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్, ఐదుగురు కార్మికులు మృతి చెందగా…. అటు వైపుగా వెళ్తున్న ఓ టీచర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. మృతులను టీచర్ సునీత(విశాఖ), మణి (దేవరాపల్లి), నారాయణ రావు(చీడకాడ), పవన్ కుమార్(కడప)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు, ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు మరొక ప్రత్యేక పోలీసు బృందం కూడా అక్కడకు చేరుకుంది. ఈ ప్రమాదంతో పినకోట గ్రామంలోనూ, సమీప ప్రాంతాల్లోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.