శ్రీశైలంలో విషాద ఘటన - ప్రైవేట్ సత్రంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురి ఆత్మహత్య
శ్రీశైలంలోని ఒక సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు లాడ్జి గదిలో అనుమానాస్పద స్థితిలో శవాలై కనిపించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, నిరంతరం వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణమైన నిర్ణయానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు.

ఆటోలు వచ్చి… సత్రంలో రూమ్ తీసుకొని
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన పల్లపు సుధాకర్ (36) అనే వ్యక్తి తన ముగ్గురు సోదరీమణులు, 15 ఏళ్ల మేనల్లుడితో కలిసి జూలై 28న శ్రీశైలం చేరుకున్నాడు. వీరంతా సుధాకర్‌కు చెందిన ఆటోలోనే వచ్చి…. ఓ ప్రైవేట్ సత్రంలోని గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
మంగళవారం రోజున సత్రం సిబ్బంది గది తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడం, లోపలి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా…. గదిలో ఉన్న ఐదుగురు కూడా ఉరివేసుకుని కనిపించారు. ఈ భయానక దృశ్యాన్ని చూసిన సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సుధాకర్, అతనిద్దరు అక్కలు, చెల్లెలు, మేనల్లుడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీనికితోడు సుధాకర్ పెద్ద అక్కలు ఇద్దరూ తమ భర్తల నుంచి విడిపోయి జీవిస్తున్నారు. కుటుంబంలో ఏకైక ఆధారమైన సుధాకర్ ఆటో నడుపుతూ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే వీరందరినీ పోషిస్తున్నాడు.
అయితే… రోజురోజుకు పెరిగిపోతున్న వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ భారంగా మారడం, మరోవైపు ఆర్థిక పరిస్థితులు ఎంతకూ మెరుగుపడకపోవడంతో వీరంతా తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. జీవితంపై తీవ్ర విరక్తి చెంది, వేరే దారి లేక అందరూ కలిసి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి… అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

