ప్రకాశం జిల్లా పాకాల సముద్ర తీరంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీరంలో ఈత కొడుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన అలలు ఉధృతికి కొట్టుకుపోయి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అందించిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కెనిగిరి సమీపంలోని శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన దాదాపు 60 మంది గ్రామస్తులు ఒక పెద్ద బృందంగా కలిసి పాకాల తీరానికి విహారయాత్రకు వచ్చారు. వీరిలో కొందరు సముద్రంలో దిగి సరదాగా ఈత కొడుతుండగా ఒక్కసారిగా వచ్చిన శక్తివంతమైన అలల ప్రవాహం వారిని సముద్రం లోపలికి లాక్కెళ్లింది.
ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా…. వారిలో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. నీట మునిగిన ఆ ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదని ఎస్పీ వివరించారు. మరో వ్యక్తి సముద్ర తీరంలోనే కన్నుమూయగా, తీవ్రంగా గాయపడిన నాల్గవ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ ఘటనలో సముద్రంలో కొట్టుకుపోయిన మరో వ్యక్తిని రక్షించగా, ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో శ్రీరంగపట్నంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.