ప్రతి మండలంలో 20-30 వర్క్‌ స్టేషన్లు.. కేబినెట్ కీలక నిర్ణయాలు!

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

Published on: Nov 10, 2025, 15:48:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 70 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ, కంపెనీలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ నిర్ణయాలు, పరిశ్రమలో ఏర్పాటులో రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ, పేదలకు ఇళ్లతోపాటు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ఏపీ కేబినెట్ నిర్ణయాలు

లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. క్వాంట కంప్యూటింగ్ సంస్థలు, నిపుణులు, క్వాంటం కంప్యూటింగ్ విడిభాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారుతోందన్నారు. విశాఖ జిల్లా కాపులుప్పాడలో పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. తిరుపతి, ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటు కానున్నాయన్నారు. డెడికేటెడ్‌ డ్రోన్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటుకు ఓర్వకల్లులో 50 ఎకరాల కేటాయించామన్నారు. ఓర్వకల్లులో సిగాచి ఇండస్ట్రియల్‌ లిమిటెడ్‌ సింథటిక్‌ ఆర్గానిక్‌ ప్లాంట్‌కు 100 ఎకరాల కేటాయింపులు చేసినట్టుగా వెల్లడించారు.

'నెల్లూరులో ఫైబర్‌ సిమెంట్‌ ప్లాంటు కోసం బిర్లా గ్రూప్‌నకు భూమి కేటాయించాం. అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా లిమిటెడ్‌కు 150 ఎకరాల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్‌ పార్కు ఏర్పాటు కానుంది. అనంతపురంలో టీఎంటీ బార్‌ ప్లాంట్‌కు 300 ఎకరాలకుపైగా కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.' అని మంత్రి పార్థసారథి తెలిపారు.

రాష్ట్రంలో డిజిటల్‌ అనుసంధాన స్పేర్‌ వర్క్‌ స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలో 20 నుంచి 30 వర్క్‌ స్టేషన్ల ఏర్పాటుకు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందజేయనుంది. విశాఖలో రియాల్టీ లిమిటెడ్‌ ఐటీ పార్కు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది.

అభివృద్ధి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యావేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. పేదలకు హౌసింగ్ కల్పించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. నివాస స్థలం లేని అర్హుల జాబితాను రూపొందించి.. హౌస్ సైట్స్ వచ్చేలా చూడాలన్నారు. ఏడాదిలోగా నివాస స్థలం లేని వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం తగదన్నారు. సరైన విధానం రూపొందించి.. సమస్యలు పరిష్కారించాలని చెప్పారు. 'వైజాగ్ పార్టనర్ షిప్ సమ్మిట్ ద్వారా యువతకు ఏం చేస్తున్నామో తెలియజేయాలి. పాఠశాలల్లో ఎవరికైనా ఆసక్తి ఉంటే వారు ఈ పార్టనర్ షిప్ సమ్మిట్ చూసే విధంగా ఏర్పాటు చేయాలి. దీని కోసం మంత్రులు పని చేయాలి. ఈ సమ్మిట్‌కు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, ముఖ్యమంత్రులు వస్తున్నారు.' అని చంద్రబాబు తెలిపారు.

ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంత్రులతోపాటుగా ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకునేలా ఇన్ఛార్జి మంత్రులు చొరవ చూపాలని చెప్పారు. రెవెన్యూ సమస్యలను ఎజెండాగా పెట్టుకుని ఇన్ఛార్జి మంత్రులు పరిష్కారం చేయాలని తెలిపారు.

మెుంథా తుపాను సమయంలో అందరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు సాయం చేశారని చంద్రబాబు అభినందించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా సహాయక చర్యలు వేగంగా అందాయన్నారు. నిరంతర పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగినట్టుగా తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More