ఉగాది కానుకగా ఏపీ ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతలు అందించిన సర్కార్… మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.6,000 జమ చేస్తోంది.

ఈ మూడో విడతగా రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు. ఇప్పటికే రెండు విడతల కలిపి రూ.14 వేలను ప్రభుత్వం అందించింది. ఈ విడత కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి రూ.20 వేల సాయం పూర్తవుతుంది.
ప్రతి రైతు ఖాతాలోకి రూ. 6 వేలు జమ కానున్న నేపథ్యంలో…. రైతులు వారి బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డబ్బులు జమ కాకపోతే సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరుతున్నారు.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చాయో రాలేదో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతు ఆధార్ నెంబర్‌తో స్టేటస్ చెక్ చేయవచ్చు. దీని ద్వారా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈకేవైసీ సమస్య ఉంటే… డబ్బులు జమ కావు. అప్పుడు వ్యవసాయశాఖ అధికారులను కలిసి తగిన పత్రాలను అందజేసి.. ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- ముందుగా https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్‌పేజీలోని “Know Your Status” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనే ఉన్న క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి.
- సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు వివరాలు డిస్ ప్లే అవుతాయి.
మనమిత్ర వాట్సాప్ లో ఇలా చెక్ చేసుకోవచ్చు:
- ముందుగా 9552300009 నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అనే మేసేజ్ చేయాలి.
- ఆ తర్వాత ఆప్షన్స్ డిస్ ప్లే అవుతాయి. ఇక్కడ అన్నదాత సుఖీభవ సేవను ఎంచుకోవాలి.
- ఇక్కడ్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ రైతు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- దీంతో రైతు వివరాలు కనిపిస్తాయి.