బంగాళాఖాతంలో వాయుగుండం..! ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన, ఈ 5 రోజులు జాగ్రత్త..!
ఏపీకి ఐఎండీ బిగ్ అలర్ట్ ఇచ్చింది. అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో 5 రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ(అక్టోబర్ 22) మధ్యాహ్ననికి ఉత్తర తమిళనాడు మరియు దక్షిణకోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తదుపరి 24 గంటల్లో మరింత బలపడేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

భారీ నుంచి అతి భారీ వర్షాలు…
ఈ ప్రభావంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని అధికారులు అలర్ట్ చేశారు.
టోల్ ఫ్రీ నెంబర్లు…
ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్, శిధిలావస్థలో ఉన్న నిర్మాణాల వద్ద ఉండరాదని సూచించారు. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదాన్నారు.
2 రోజుల వెదర్ రిపోర్ట్….
బుధవారం (22-10-25) : ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గురువారం (23-10-25) : బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి బారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి (జి) చిలమనూరులో 79 మిమీ, నెల్లూరు (జి) ఆత్మకూరులో 77.2 మిమీ వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక తిరుపతి(జి) మన్నారుపోలూరులో 69.7 మిమీ, గొల్లగుంటలో 68.5 మిమీ, పాపమాంబాపురంలో 64.5 మిమీ, కొండూరులో 63 మిమీ, వెంకటగిరిలో 57 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











