Postal Jobs : పదో తరగతి మార్కులతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్-917, తెలంగాణ-419 పోస్టులు
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఖాళీలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు తపాలా శాఖ భారీ శుభవార్త అందించింది. వివిధ పోస్టల్ సర్కిళ్ల పరిధిలో వేలాది ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ (GDS) విభాగంలో ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ నియామకాల ప్రత్యేకత ఏమిటంటే అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేదా రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఉండదు. పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే నేరుగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా 23,757 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా నింపనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా మంచి అవకాశాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 917 పోస్టులు, తెలంగాణ సర్కిల్‌లో 419 పోస్టులు ఉన్నాయి.
పోస్టల్ శాఖ ప్రవేశపెట్టిన వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు కింది గడువులను గమనించి వెంటనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఓటీఆర్ ప్రారంభ తేదీ ఆగస్టు 31న మెుదలైంది. ఓటీఆర్ ముగింపు తేదీ సెప్టెంబరు 19 వరకు ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం సెప్టెంబరు 2 నుంచి జరుగుతుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబరు 21గా వరకు ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు: 3 సంవత్సరాలు, దివ్యాంగులకు (PwD): 10 సంవత్సరాలు సడలింపు దొరుకుతుంది.
పోస్టులను బట్టి ప్రాథమిక వేతనం కింది విధంగా నిర్ణయిస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నెలకు రూ. 12,000 నుండి రూ. 29,380 వరకు. ABPM / డాక్ సేవక్ నెలకు రూ. 10,000 నుండి రూ. 24,470 వరకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాల్లో చేరిన వారు రోజుకు కేవలం 4 గంటల పాటు విధులు నిర్వర్తిస్తే సరిపోతుంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌కి సంబంధించిన బ్యాంకింగ్ సేవలు అందించినందుకు గాను ప్రతి నెలా ప్రత్యేకంగా విడిగా ప్రోత్సాహకాలు ఇస్తారు. విధుల నిర్వహణకు కావలసిన స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తపాలా శాఖ స్వయంగా అందజేస్తుంది.
గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక భాష (తెలుగు) చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. సైకిల్ తొక్కడం రావడం లేదా ద్విచక్ర వాహనం నడపడం తెలిసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన సంబంధిత పోస్టల్ ఆఫీస్ పరిధిలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే పోస్టల్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


