...
...
Next Story

విశ్లేషణ : ప్రగతి ప్రస్థానానికి 'తల్లికి వందనం' పునాది

ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద జులై 22న మొదటి విడత నిధులు తల్లుల ఖాతాల్లో జమ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందుతారు. ఈ స్కీమ్ పై జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ రాసిన విశ్లేషణ…

Published on: Jul 20, 2026, 11:18:02 IST
Advertisement

ఒక దేశపు భవిష్యత్తు ఎక్కడ రూపుదిద్దుకుంటుంది..? అసెంబ్లీ హాల్స్‌లోనో, సచివాలయాల ఫైళ్లలోనో కాదు... నిశ్శబ్దంగా, అత్యంత శక్తివంతంగా తరగతి గదుల్లో...అక్షరాల్లో రూపుదిద్దుకుంటుంది. అక్షరం ఒక మనిషి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఆయుధం. సమాజంలో అణచివేతకు, తరతరాల పేదరికానికి వ్యతిరేకంగా పోరాడగలిగే ఏకైక శక్తీ అక్షరమే. అందుకే, నవ్యాంధ్రప్రదేశ్‌ను కేవలం భౌతిక అభివృద్ధిలోనే కాదు, విద్యా ప్రగతిలోనూ అగ్రస్థానంలో నిలపాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ సుదీర్ఘ అక్షర యజ్ఞంలో... పేద తల్లుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన చారిత్రాత్మక విప్లవం "తల్లికి వందనం" పథకం గురించి ఈ సందర్భంగా మాట్లాడుకోవడం సముచితం.

విశ్లేషణ : ప్రగతి ప్రస్థానానికి 'తల్లికి వందనం' పునాది
విశ్లేషణ : ప్రగతి ప్రస్థానానికి 'తల్లికి వందనం' పునాది

పిల్లల చదువులకి పేదరికం అడ్డు కాకూడదనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బలమైన సంకల్పం. తన పిల్లల చదువుకోసం ఒక పేద తల్లి పడే కష్టం మాటల్లో చెప్పలేనిది. తెల్లవారక ముందే లేచి, పనికి వెళ్లే ప్రతి తల్లి... ‘‘నా బతుకు ఎలాగో ఇలాగే గడిచిపోయింది, నా బిడ్డల భవిష్యత్తయినా బాగుండాలి’’ ఆరాటపడుతుంది. తన ఆకలిని దాచుకుని, బిడ్డ పుస్తకాల సంచీ బరువును మోసే ఆ మాతృమూర్తుల శ్రమ నిరుపమానమైనది. 'తల్లికి వందనం' అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకమో, బడ్జెట్ కేటాయింపుల తంతో కాదు, అది బిడ్డల చదువుల కోసం అహర్నిశలూ శ్రమించే ప్రతి తల్లి త్యాగానికి కూటమి ప్రభుత్వం సమర్పిస్తున్న గౌరవ వందనం. ఇది కేవలం ఎన్నికల వేళ ఓట్ల కోసం ఇచ్చిన తాత్కాలిక హామీ కాదు. రాబోయే తరాల మేధో సంపత్తికి మన కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న శాశ్వతమైన పునాది.

గత ఐదేళ్ల కాలంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా రాజకీయ స్వార్థానికి బలయ్యిందో చూశాం. 'అమ్మ ఒడి' అనే ఆకర్షణీయమైన పేరుతో తెరపైకి వచ్చిన గత ప్రభుత్వ విధానం... క్షేత్రస్థాయిలో తల్లుల మనసులను ఎంతగా గాయపరిచిందో చరిత్ర సాక్షిగా నిలిచింది. ఒక ఇంట్లో ఇద్దరో, ముగ్గురో పిల్లలు ఉంటే... కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకున్న సంకుచిత శైలి అది. ఈ అపహాస్యానికి, వివక్షకు స్వస్తి పలుకుతూ మన కూటమి ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో విద్యా సంస్కరణలు చేపట్టింది. అమ్మ ప్రేమలో వివక్ష లేనప్పుడు, ప్రభుత్వ ఆదరణలో ఎందుకు ఉండాలనే నిలదీతతో... అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే, అంతమందికీ రూ. 15,000 చొప్పున అందిస్తూ, ప్రతి ఒక్క తల్లి కన్న ఉన్నత చదువుల కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తోంది.

ప్రజాధనం అర్హుడైన ప్రతి నిరుపేదకూ నూరు శాతం చేరాలనేదే ఆశయంతో కూటమి ప్రభుత్వం ఈ పథకానికి స్పష్టమైన, పారదర్శకమైన అర్హతలను నిర్దేశించింది. కుటుంబ నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000 మించకుండా ఉండటం, కనీసం ఒక్కరికైనా యాక్టివ్ రైస్ కార్డు ఉండటం వంటి నియమాలు అర్హులైన పేదలను గుర్తించడానికి తోడ్పడతాయి. కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి లోపు ఉండటం, గత 12 నెలల సగటు విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు ఉండటం కూడా ఇందులో భాగమే. పేదలకు ఉపాధి కల్పించే ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు ఇస్తూనే, సొంత నాలుగు చక్రాల వాహనాలు లేనివారిని, మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంగల ఇల్లు లేని పేదలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు మినహా సమాజంలోని నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాలన్నింటికీ ఈ చదువుల సాయం అందుతుంది.

చదువుకు వందనం సాయాన్ని కేవలం ఒక ప్రకటనగా వదిలేయకుండా, అత్యంత పకడ్బందీగా టైమ్-లైన్ ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ జులై 22న మొదటి విడత నిధులు జమ కానున్నాయి. ఇందులో ప్రతి తల్లి బ్యాంకు ఖాతాకు రూ. 13,000 నేరుగా అందుతుండగా, బిడ్డలు చదువుకునే పాఠశాల నిర్వహణ, సౌకర్యాల మెరుగుదల కోసం రూ. 2,000 నిధులను కేటాయించడం జరిగింది. కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను సైతం ఆగస్టు 25 నాటికి నమోదు చేసుకుని, ఆగస్టు 30 కల్లా నూరు శాతం నిధులను తల్లుల ఖాతాలలో చేర్చేలా అధికార యంత్రాంగం రాత్రింబగళ్లు శ్రమిస్తోంది.

ఈ అక్షర విప్లవం కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాలేదు. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లు పొందిన 1.04 లక్షల మంది నిరుపేద విద్యార్థుల తల్లులను కూడా ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. వారి పాఠశాల ఫీజును సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా నేరుగా పాఠశాలలకు చెల్లిస్తూ, మిగిలిన మొత్తాన్ని తల్లుల ఖాతాలకే జమ చేస్తోంది. ఏ ఒక్క పేద కుటుంబానికి వారి కులం వల్లనో, మతం వల్లనో వివక్ష జరగకూడదన్నదే ఆశయంతో సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేస్తూ 'మనమిత్ర' వాట్సప్ చాట్ బాట్, లీప్ యాప్‌లను ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రతి ఒక్కరూ తమ అర్హతలను తామే సులభంగా తనిఖీ చేసుకునే అవకాశం కలిగింది.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటోంది. రేపటి అంతర్జాతీయ వేదికలపై, గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌లలో మన తెలుగు బిడ్డలు విజేతలుగా నిలబడాలన్నదే కూటమి ప్రభుత్వ స్వప్నం. అమ్మ ప్రేమను, ఆమె పడుతున్న కష్టాన్ని గౌరవిస్తూ ప్రవేశపెట్టిన 'తల్లికి వందనం' పథకం రాబోయే తరాలకు ఒక బలమైన సామాజిక, ఆర్థిక ఆయుధంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చదువే పిల్లల తలరాతను మారుస్తుంది. ఆ చదువుకి శ్రీకారం చుట్టే బాధ్యతను కూటమి ప్రభుత్వం భుజాన వేసుకుంది. నవ్యాంధ్రను అక్షరాస్యతలో, మేధో సంపత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపడానికి అంతా ఒక సామాజిక బాధ్యతగా కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేద్దాం.

విశ్లేషణ : లింగమనేని రమేష్, రాజ్యసభ సభ్యులు, జనసేన పార్టీ

లింగమనేని రమేష్, రాజ్యసభ సభ్యులు, జనసేన పార్టీ

(గమనిక: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణ రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌ (హెచ్‌టీ)వి కావు. వీటికి హెచ్‌టీ బాధ్యత వహించదు).

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks