విజయవాడ ఆటోనగర్‌ బొమ్మల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం!

విజయవాడ ఆటోనగర్‌ బొమ్మల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.

Published on: Nov 21, 2026, 15:50:48 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆటోనగర్ 3వ క్రాస్ రోడ్, రోడ్ నంబర్ 2లో ఉన్న ఒక ప్రముఖ బొమ్మల తయారీ పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో ప్లాస్టిక్, ఇతర మండే స్వభావం కలిగిన ముడిసరుకు భారీగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. దీంతో దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయగా, స్థానిక పారిశ్రామికవేత్తలు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

టాయ్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
టాయ్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ఉదయం పూట ఫ్యాక్టరీ నుండి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే లోపల పిల్లల బొమ్మల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్, ప్యాకింగ్ మెటీరియల్, రంగులు, రసాయనాలు ఉండటంతో మంటలు అత్యంత వేగంగా ఎగిసిపడ్డాయి.

ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ భవనంలోని మొదటి, రెండో అంతస్తులు పూర్తిగా మంటలకు ఆహుతయ్యాయి. విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచిన పిల్లల బొమ్మలు, ఖరీదైన తయారీ యంత్రాలు, ముడి సరుకు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉదయం సమయం కావడంతో ఫ్యాక్టరీలో కార్మికుల రద్దీ తక్కువగా ఉండటం వల్ల ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఏసీపీ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాద వివరాలను వెల్లడించారు. 'ఉదయం 7 గంటల సమయంలో ఆటోనగర్ రోడ్ నంబర్ 2లోని టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశాం. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ. 5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో సంస్థకు సంబంధించిన కొన్ని కీలక రికార్డులు, లెక్కల పుస్తకాలు కూడా కాలిపోయాయి. పూర్తిస్థాయి విచారణ, లెక్కల పరిశీలన తర్వాతే అసలు నష్టం ఎంతనేది స్పష్టమవుతుంది.' అని ఆయన పేర్కొన్నారు.

విజయవాడ ఆటోనగర్ నుండి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అతికొద్ది బొమ్మల తయారీ కేంద్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ నాణ్యతతో తయారయ్యే పిల్లల బొమ్మలు, ఇతర ఉత్పత్తులను సుమారు ఆరు విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. విదేశీ ఆర్డర్లకు అనుగుణంగా సిద్ధం చేసిన స్టాక్ అగ్నికి ఆహుతి కావడంతో నిర్వాహకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ ఆటోనగర్‌లో వేలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ప్లాస్టిక్, కెమికల్, ఆటోమొబైల్ యూనిట్లు పక్కపక్కనే ఉండటంతో ఫైర్ సేఫ్టీ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని, అత్యవసర సమయాల్లో అగ్నిమాపక వాహనాలు వేగంగా చేరుకునేందుకు రోడ్లపై ఆక్రమణలు తొలగించాలని స్థానిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.