Vijayawada Gade Sai Krishna Case : గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం - సీఐ నాగరాజుపై కేసు నమోదు..!

Vijayawada Gade Sai Krishna Missing Case : విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదైంది. గాదె సాయికృష్ణ అనే యువకుడిని లాకప్‌లో హింసించి చంపేశారని తల్లి ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. 

Published on: Jun 19, 2026, 15:29:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijayawada Gade Sai Krishna Missing Case : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన యువకుడి అదృశ్యం ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన నాగరాజుపై పోలీసులు శుక్రవారం హత్య కేసు నమోదు చేశారు. గాదె సాయికృష్ణ (23) అనే యువకుడిని పోలీస్ కస్టడీలో దారుణంగా హింసించి…. చంపేశారంటూ బాధితుడి తల్లి ఆరోపించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

యువకుడి అదృశ్యం కేసులో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై మర్డర్ కేసు (representative image )
యువకుడి అదృశ్యం కేసులో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై మర్డర్ కేసు (representative image )

తల్లి ఫిర్యాదు - సీఐపై చర్యలు

సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి (53) గురువారం సాయంత్రం ఇన్‌స్పెక్టర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా…. పోలీసులు శుక్రవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. "నిన్న సాయంత్రం (గురువారం) నా సోదరి విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు," అని సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ పిటిఐ వార్తా సంస్థకు వివరించారు.

ఇన్‌స్పెక్టర్ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103 (1), 127 (4), 127 (6) లతో పాటు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 238 కింద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 103 హత్య నేరానికి సంబంధించింది కాగా….. సెక్షన్ 127 అక్రమ నిర్బంధాన్ని సూచిస్తుంది.

తమ కుమారుడిని ఇన్‌స్పెక్టర్ నాగరాజు పోలీస్ స్టేషన్‌లోనే అక్రమంగా బంధించి, ప్రాణం పోయే వరకు దారుణంగా హింసించాడని తల్లి ఆరోపిస్తోంది. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండా బూడిదగా మార్చేశాడని విజయలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా, అత్యంత రహస్యంగా సాయికృష్ణ మృతదేహాన్ని ఇన్‌స్పెక్టర్ దహనం చేశాడని అనుమానం వ్యక్తం చేసింది.

యువకుడి అదృశ్యం ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించేందుకు వీలుగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నియమించారు.

మరోవైపు గురువారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కస్టడీ మరణంపై సిబిఐ (CBI) దర్యాప్తు జరిపించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. కస్టడీలో థర్డ్ డిగ్రీ హింస జరిగిందని…. బాధితుడిని తీవ్రంగా వేధించడమే కాకుండా చేతి గోళ్లు కూడా పీకేశారని జగన్ ఆరోపించారు. మే 9 నుంచి జూన్ 2 వరకు సాయికృష్ణ తల్లి ప్రతిరోజూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తన కొడుకును ఒక్కసారి చూపించమని పోలీసులను వేడుకుందని మాజీ సీఎం గుర్తుచేశారు. లోపల కొడుకును కొడుతుంటే వస్తున్న అరుపులు వింటూ బయట ఆ తల్లి రోదించినా….. కనీసం చూడటానికి కూడా పోలీసులు అనుమతించలేదని ఆయన విమర్శించారు.

నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సహా సీనియర్ పోలీస్ అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన రాలేదని జగన్ ఆరోపించారు. బాధితుడి బంధువులలో ఒక న్యాయవాది ఉన్నారని, ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన వినతులను సైతం ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత పేర్కొన్నారు.

వెలుగులోకి మరో వీడియో…!

ఈ వివాదం ఇలా ఉంటే….. అదే ఇన్‌స్పెక్టర్ నాగరాజు వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడిన పెరుపోగు క్రాంతి కుమార్ అనే దళిత యువకుడి సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఇన్‌స్పెక్టర్ నాగరాజు పెడుతున్న టార్చర్, వేధింపులు తట్టుకోలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మే 21న విషం తాగి ప్రాణాలు విడుస్తూ తీసుకున్న ఆ సెల్ఫీ వీడియోలో క్రాంతి కుమార్ ఆరోపించారు. సాయికృష్ణ కేసు వెలుగులోకి రావడంతో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More