ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల రీసర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి అయింది. అంతేకాకుండా గతంలో ఉన్న పాసు పుస్తకాలను కూడా రద్దు చేయగా…. కొత్త వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయంపై చాలా రోజులుగా కసరత్తు చేస్తూ వస్తోంది. ఇప్పటికే రీసర్వే పూర్తి అయిన భూములకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
జనవరి మొదటి వారం నుంచి….
ఇందులో భాగంగా కొత్త సంవత్సరం వేళ రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు గ్రామసభల ద్వారా వీటిని అందజేయనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది.
గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు(పీపీబీ) పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. వీటిపై ఎవరూ ఫొటోలు ఉండవు. ఇప్పటికే ముద్రణ పూర్తయిన పట్టాదారు పాస్‌పుస్తకాల్ని రైతులకు అందజేయనుంది.
పట్టాదారు పుస్తకంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని రెవెన్యూశాఖ అధికారులకు స్పష్టం చేసింది. అందజేయకముందే తప్పులు సరిచూసుకోవాలని సూచించింది. వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారుకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలని సూచించింది. పంపిణీ ప్రక్రియ వీఆర్వో ఆన్‌లైన్ ఈకేవైసీ ద్వారా నిర్వహించాలని పేర్కొంది. కొత్తవి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పాత భూహక్కు పత్రాలు(బీహెచ్‌పీ) వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.