TTD Hair Donation Record 2026 : తిరుమలలో సరికొత్త రికార్డ్.. ఈ మే నెలలోనే 12 లక్షల మంది తలనీలాలు!

TTD Hair Donation Record 2026 : తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఈ ఏడాది మే 27 నాటికే 12.43 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి గత రెండేళ్ల రికార్డులను బద్దలు కొట్టారు.

Published on: May 29, 2026, 11:14:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TTD Hair Donation Record 2026 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ "నల్ల బంగారాన్ని" గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలోనే అత్యధికంగా సమర్పించడం విశేషం.

తిరుమలలో సరికొత్త రికార్డ్.. మే నెలలోనే 12 లక్షల మంది తలనీలాలు!
తిరుమలలో సరికొత్త రికార్డ్.. మే నెలలోనే 12 లక్షల మంది తలనీలాలు!

వేసవి సెలవులు, వారాంతపు రద్దీ తోడుకావడంతో తిరుమలకు భక్తుల రాక అసాధారణంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, తలనీలాలు సమర్పించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పటిష్టమైన ఏర్పాట్లు చేసి నిరంతరాయంగా సేవలు అందిస్తోంది.

గత రెండేళ్ల రికార్డులు బద్దలు

ఈ ఏడాది మే నెలలో భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మే 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కేవలం 27 రోజుల్లోనే ఏకంగా 12,43,063 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. గత రెండు సంవత్సరాల మే నెలల మొత్తం గణాంకాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ.

2024 మే నెలలో మొత్తం 10,65,729 మంది భక్తులు… అలాగే 2025 మే నెలలో మొత్తం 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గత రెండేళ్లలో మే నెల మొత్తం మీద జరిగిన ముండనాలతో పోలిస్తే…. ఈ ఏడాది మే నెల ఇంకా ముగియక ముందే ఆ రికార్డులన్నీ దాటిపోవడం విశేషం. ముఖ్యంగా మే 18 నుంచి 23 వరకు వరుసగా ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 50 వేలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇందులో మే 23వ తేదీన ఒక్కరోజే రికార్డు స్థాయిలో 57,580 మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

11 ప్రాంతాల్లో మినీ కళ్యాణకట్టలు

భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఎక్కువ సమయం వేచి ఉండకుండా…. వేగంగా సేవలు పొందేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాలలో 11 మినీ కళ్యాణకట్టలను అందుబాటులోకి తెచ్చింది. పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5, జీఎన్‌సీ, హెచ్‌వీసీ, సప్తగిరి విశ్రాంతి గృహం, నందకం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీవేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతాల్లో ఈ మినీ కేంద్రాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.

భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం టీటీడీలో మొత్తం 1,152 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో సేవలు అందిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం వీరిలో 269 మంది మహిళా క్షురకులను కూడా టీటీడీ నియమించింది. సాధారణంగా ఒక్కో క్షురకుడు తమ విధుల్లో భాగంగా 6 గంటల షిఫ్టులో 40 మంది భక్తులకు క్షర కర్మ (గుండు గీయడం) చేయాల్సి ఉంటుంది. అయితే పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు చర్యలు చేపట్టింది. ప్రతిరోజూ అదనంగా 250 మంది సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించింది. దీనివల్ల ప్రస్తుతం ఒక్కో క్షురకుడు అదనంగా దాదాపు 50 మంది భక్తులకు క్షర కర్మ చేస్తూ నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు.

  • భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కళ్యాణకట్టల్లో టీటీడీ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. భ
  • క్తులకు ఉపయోగించే బ్లేడ్లను క్షురకులు నేరుగా వాడకుండా, వాటిని ముందుగా సోడియం సొల్యూషన్‌లో ముంచి, ఆ తర్వాత డెటాయిల్‌తో పూర్తిగా శుభ్రపరిచిన తర్వాతే వినియోగిస్తున్నారు.
  • గుండు గీసిన తర్వాత తలనీలాలను ఎప్పటికప్పుడు సేకరించి భద్రపరుస్తున్నారు.
  • ప్రతి కళ్యాణకట్టలోనూ భక్తులు తలస్నానం చేసేందుకు తగినన్ని స్నానపు గదులతో పాటు వేడి నీటి సదుపాయాన్ని కల్పించారు.
  • తలనీలాల సమర్పణ పూర్తయిన వెంటనే భక్తులకు చల్లదనం కోసం ఉచితంగా చందనం బిళ్లలను అందజేస్తున్నారు.
  • పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగా పారిశుద్ధ్యం… తాగునీరు, కూర్చునే సదుపాయాలు, టోకెన్ విధానాన్ని టీటీడీ మరింత బలోపేతం చేసింది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More