ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన : అసలు వివాదం ఏంటి..? ఎలా ముగిసింది..?

Professor Nageshwar Janasena Controversy : ఓ రాజకీయ విశ్లేషణలో భాగంగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, జనసేన పార్టీ మధ్య వివాదం రాజుకుంది. జనసేన పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరాలు రావటంతో…. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో ఈ వివాదానికి తెరపడింది.

Published on: May 22, 2026, 10:37:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Professor Nageshwar Janasena Controversy : సోషల్ మీడియా వేదికగా జరిగే రాజకీయ విశ్లేషణలు, చర్చలు ఒక్కోసారి తీవ్ర దుమారం రేపుతుంటాయి. అలాంటి పరిణామమే ఏపీ రాజకీయవర్గాల్లో చోటు చేసుకుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ కేంద్రంగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లను లక్ష్యంగా చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అయిన… ఓ వార్త ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.

ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన
ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన

అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారు..?

యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై సమకాలీన రాజకీయాలపై ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ విశ్లేషణలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జనసేన అగ్రనేతలకు సంబంధించిన ఒక అంశాన్ని తన విశ్లేషణలో ప్రస్తావించారు.వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్… కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారని చెప్పారు. దానికి అమిత్ షా నిరాకరించారని ఆ మీడియాలో పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇన్‌స్టాంట్‌ ఫ్రెండ్ ఉంటాడు.. లాంగ్ టర్మ్‌ ఫ్రెండ్‌ ఉంటారని… జగన్‌ లాంగ్ టర్మ్‌ ఫ్రెండ్‌ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలే జనసేన - నాగేశ్వర్ మధ్య తీవ్ర వివాదానికి దారితీశాయి.

ప్రొఫెసర్ ప్రస్తావించిన సదరు వార్త పూర్తిగా ఊహాజనితమైనదని…. దానికి ఎలాంటి ఆధారాలు లేవని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక ప్రొఫెసర్ ఇలాంటి విమర్శలు చేయడంపై జనసైనికులు, కూటమి మద్దతుదారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న కొన్ని పొలిటికల్ గాసిప్స్, ఫేక్ ఐడీల పోస్టులను ఆధారంగా చేసుకుని ఒక బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ హోదాలో ఉండి ఇలాంటి విశ్లేషణలు చేయడం సరికాదని జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర పెద్దలతో జరిగిన అధికారిక భేటీలను ఇలా వక్రీకరించడంపై సామాజిక మాధ్యమాల్లో ప్రొఫెసర్‌ను గట్టిగా నిలదీశారు. అంతేకాదు జనసైనికులు.. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై చర్యలను తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లను కూడా ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. మంత్రి నాదెండ్లతో పాటు ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఈ అంశాలపై స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు చూస్తే…. పవన్ కల్యాణ్ ని వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయన్నారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఒక పార్టీకి మేలు చేసేలా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలికారు. వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ అంశంపై జనసేన పార్టీ లీగల్ సెల్, సోషల్ మీడియా విభాగాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు…. తాను ప్రస్తావించిన అంశాలను ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నారు. రాజకీయ విశ్లేషణల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లోని అవాస్తవ సమాచారాన్ని నమ్మి మాట్లాడటం పొరపాటని భావించి… ఆయన ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

సీనియర్ విశ్లేషకుడైన నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో… జనసేన పార్టీ కూడా హుందాగా స్పందించింది. ఈ వివాదానికి ఇక్కడితో స్వస్తి పలకాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో ఇకపై దీనిపై ఎలాంటి చర్చలు పెట్టవద్దని తమ కార్యకర్తలను ఆదేశించింది.

"మీలాంటి అనుభవజ్ఞులు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది. కానీ… భవిష్యత్తులో జనసేన పార్టీకి సంబంధించిన ఏవైనా వార్తలు లేదా అనుమానాస్పద కథనాలు మీ దృష్టికి వస్తే.. నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదిస్తే మేమే సరైన, చట్టబద్ధమైన సమాచారాన్ని అందిస్తాం" అని పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ వివాదం ఇక్కడితో ముగిసిందని స్పష్టం చేసిన జనసేన నాయకత్వం… తమ పార్టీ కార్యకర్తలకు (జనసైనికులకు), కూటమి నాయకులకు కీలక సూచనలు చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నందున… ఇకపై ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని స్పష్టం చేసింది. దీనిపై సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్స్, పోస్టులు లేదా ప్రతికూల వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More