తిరుమల : టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం

తిరుమల శ్రీవారికి భారీస్థాయిలో విరాళాలు అందుతున్నాయి. కొందరు భక్తులు డబ్బులు విరాళాలు ఇస్తుండగా…. మరికొందరూ భక్తులు వాహనాలు అందిస్తున్నారు. తాజాగా పూణెకు చెందిన ఓ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందజేసింది.

Published on: Nov 15, 2025, 17:22:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అంతే సంఖ్యలో విరాళాలు అందుతాయి. ఇటీవలే కాలంలో విరాళాలు ఇచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వీరిలో కొంతమంది భక్తులు బంగారం, వెండి వంటివి ఇస్తే… మరికొందరు డబ్బులు అందజేస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారికి ఓ కంపెనీ ఎలక్ట్రిక్ బస్సును అందజేశారు. ఈ మేరకు టీటీడీ వివరాలను పేర్కొంది.

టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం
టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం

“పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్‌ బస్సును శనివారం విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు” అని టీటీడీ పేర్కొంది.

రూ. కోటి విరాళం:

విజయవాడకు చెందిన శ్రీ మోనిష్ వెంకట సత్య ప్రకాష్ అనే భక్తుడు భారీ విరాళాన్ని ప్రకటించారు. శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరపున ప్రతినిధి భూషణ్ తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

వేడుకగా కార్తీక దీపోత్సవం:

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.

ముందుగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళ ధ్వని, తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ఆగమ పండితులు శ్రీ రాఘవేంద్ర వేదస్వస్తి, అనంతరం దీప ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు.

అనంతరం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన “శ్రీ లక్ష్మి ఆవిర్భవం” నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. తరువాత భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More