అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు రద్దు!
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 30న ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి తీసుకువచ్చి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
అక్టోబర్ 29న అంకురార్పణ కారణంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 30 పుష్పయాగం రోజున తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు రద్దయ్యాయి. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
పరకామణి చోరీ కేసు దర్యాప్తు
మరోవైపు తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి సీఐడీ బృందం దర్యాప్తు మెుదలుపెట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయన్నార్ బృందం మంగళవారం తిరుమలలో పర్యటించింది. శ్రీవారి ఆలయ పరకామణి పరిశీలన చేసింది. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన రికార్డులను చూసింది.
2023 మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ అయిన విషయం తెలిసిందే. 920 డాలర్లను చోరీ చేస్తూ.. టీటీడీ ఉద్యోగి రవికుమార్ దొరికాడు. దీనిపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ చేయలేదని ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. దీంతో హైకోర్టు ఆదేశాలతో కేసును సీఐడీ తిరిగి దర్యాప్తు చేస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


