ఏపీకి రూ.82 వేల కోట్ల పెట్టుబడి.. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ!
ఏపీలో మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ఏపీలో పెట్టుబుడులు క్యూ కడుతున్నాయి. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025కి ముందే పలు కంపెనీలు ఏపీలో తమ పెట్టుబడుల గురించి ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో సంస్థ భారీ పెట్టుబడులను ఏపీకి ప్రకటించింది. రెన్యూ ఎనర్జీ రాష్ట్రంలో రూ.82 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ సోలార్ ఇన్గోట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో సంస్థ పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ జరగనున్నట్టుగా పేర్కొన్నారు.

ఈ పెట్టుబడితో కంపెనీ నాలుగు ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. మొదటిది 6 జిగావాట్ (GW) సౌర PV ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్, రెండో 6.3 GWp హైబ్రిడ్ సైట్స్ ప్లస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, మూడో 2 GW హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్, నాల్గోది 300 KTPA గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. వీటితోపాటుగా ఒకే ప్రదేశంలో 4.8 GWp రెన్యూ అతిపెద్ద హైబ్రిడ్ సైట్ + BESS కూడా వస్తుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 10,000కి పైగా ప్రత్యక్షంగా/పరోక్షంగా ఉద్యోగాలను రానున్నాయి.
ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌పై దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నాను. గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చామన్నారు. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నామని చెప్పారు.
'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని వివరిస్తున్నాను.' అని నారా లోకేశ్ అన్నారు.













