రైతు భరోసా నిధులు విడుదల.. 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు!
రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మెుదటి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2482 కోట్ల నిధులను జమ చేస్తారు.
హైదరాబాద్ శిల్పాకళావేదికలో నిర్వహించిన సభలో రైతు భరోసా నిధుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలో అన్నదాతలు ఆత్మగౌరవంతో బతికేలా, వ్యవసాయాన్ని ఒక పండుగలా తీర్చిదిద్దేందుకు సంపూర్ణంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన వినాశనాన్ని సరిదిద్దుతూ, సంక్షేమం, వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి, పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు కాలం నుండి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు (దాదాపు 60 ఏళ్లలో) తెలంగాణ అప్పు కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
'జూన్ 2, 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు రూ.69 వేల కోట్ల అప్పు ఉంటే.. డిసెంబర్ 7, 2023న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి కల్వకుంట్ల కుటుంబం దానిని ఏకంగా రూ.8 లక్షల 11 వేల కోట్లకు చేర్చింది. తెలంగాణను మళ్లీ లేవకుండా అప్పుల ఊబిలో ముంచేసింది.' అని ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో తాము అప్పులపై విమర్శలు చేస్తే అబద్ధాలని బుకాయించారని, తీరా అధికారంలోకి వచ్చి తవ్వి చూస్తే గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయని సీఎం అన్నారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు, సర్పంచ్‌ల నిధులు, హాస్టల్ పిల్లల మెస్ ఛార్జీలు, బడి పిల్లల బట్టల బిల్లులను కూడా చెల్లించకుండా బకాయీలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు పెట్టిన బకాయిలను కట్టే బాధ్యత తమ ప్రభుత్వంపై పడిందని, అయినా వెనకడుగు వేయకుండా ప్రతినెలా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రెండేళ్లలోనే కూలిపోయి 'కూలేశ్వరం' అయిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము గోదావరి పాలైందని విమర్శించారు. ఏ ఊరిలో పంట పండినా అది కాళేశ్వరం నీళ్లతోనేనని గొప్పలు చెప్పుకున్నారని, కానీ గత మూడేళ్లుగా కాళేశ్వరం నుండి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ రైతులు తమ కష్టార్జితంతో 2 కోట్ల 80 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించారని కొనియాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు రైతుల కోసం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాము నెలకు రూ.6 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే, బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పోల్చి చూపారు.
'ప్రభుత్వం రాగానే తొలి విడతగా రూ.7 వేల కోట్లు ఇచ్చాం. ఇప్పటివరకు మొత్తం రూ.27 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రాబోయే 9 రోజుల్లో మరో రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద చెల్లించడానికి నగదు సిద్ధం చేశాం. దీంతో మొత్తం రూ.36 వేల కోట్లు చెల్లించినట్లవుతుంది. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాగానే ఉచిత కరెంట్ ఫైల్‌పై సంతకం చేశారు. ప్రస్తుతం నెలకు రూ.1000 కోట్లు ఉచిత విద్యుత్ కోసం ఖర్చు చేస్తున్నాం. సన్న వడ్ల బోనస్ కోసం రూ.4 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.3,500 కోట్లు కేటాయించాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే భార్యాభర్తల ఫోన్ సంభాషణలు వినడం మినహా ఏమీ చేయడని రేవంత్ రెడ్డి అన్నారు. సొంత బిడ్డ కూడా తన ఫోన్ సంభాషణలు విన్నారని ఒప్పుకుందని, పెళ్లాం మొగుడు మాట్లాడుకునే మాటలు ఎలా విన్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక అలాంటి తప్పుడు పనులకు స్వస్తి పలికామని, తాము ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు.
మహిళా సంఘాలను 1000 బస్సులకు యజమానులను చేయడంతో పాటు, వారి ద్వారా 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు, రిలయన్స్‌తో పోటీ పడేలా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. శిల్పారామంలో మహిళా సంఘాల స్టాల్స్ కోసం రూ.1000 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించామన్నారు. ధరణి స్థానంలో భూభారతిని తీసుకువచ్చి భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని, కేసీఆర్ తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 30 నెలల్లోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పష్టం చేశారు. త్వరలోనే మరో 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు.
మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులను విపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, పోర్లు దండాలు పెట్టినా అభివృద్ధి పనులన్నీ చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం వాతావరణ మార్పులను బట్టి రైతులు పంటలు వేసుకోవాలని, ఇందుకోసం రైతు వేదికల్లో 7 రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని సూచించారు. అబద్ధాల పునాదులపైన తాను ప్రభుత్వాన్ని నడపనని, పదవి శాశ్వతం కాకపోయినా ఇచ్చిన మాట కోసం నిలబడతానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


