సింహ వాహనంపై యోగ ‌న‌ర‌సింహుడి అలంకారంలో పద్మావతి అమ్మవారు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు రాత్రి సింహ వాహనంపై అమ్మవారు దర్శనం ఇచ్చారు.

Published on: Nov 20, 2025, 05:38:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి సింహ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో అమ్మవారు భక్తులను క‌టాక్షించారు. సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వాహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుందని నమ్మకం. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీరత్వం , యశస్సు, ప్రభ, జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుందంటారు. వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.

సింహ వాహనంపై యోగ ‌న‌ర‌సింహుడి అలంకారంలో అమ్మవారు
సింహ వాహనంపై యోగ ‌న‌ర‌సింహుడి అలంకారంలో అమ్మవారు

ఈ సింహ వాహనసేవలో పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఆల‌య‌ డిప్యూటీ ఈవో హ‌రీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, అర్చకులు, ఇతర అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.

స్నపన తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన బుధ‌వారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా నిర్వహించారు.

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర, వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను చేశారు.

ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక మాల వంతున ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. నెమ‌లి ఈక‌ల మాల‌, ద్రాక్ష, రోజ్ పెటల్స్, వ‌ట్టివేరు, తులసి, రంగురాళ్లతో కూడిన రోజామాలలు అమ్మవారికి అలంకరించారు.

పద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపం టీటీడీ గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. దాదాపు 80 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More