తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - చిన్నశేష వాహనంపై కృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి దర్శనం!

Tirumala Navaratri Brahmotsavam 2026 : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

Published on: Oct 13, 2026, 12:25:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Tirumala Navaratri Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం (2026 అక్టోబరు 13) ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై అధిరోహించి, ద్వారకా శ్రీకృష్ణుడి విశేష అలంకారంలో భక్తకోటికి దివ్యదర్శనమిచ్చారు.

చిన్నశేష వాహనంపై కృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
చిన్నశేష వాహనంపై కృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి దర్శనం

సర్వాలంకార భూషితుడైన స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూసి మాడ వీధుల్లో వేచి ఉన్న వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వాహనసేవ ముందర గజాలు, అశ్వాలు రాజసంతో నడుస్తుండగా… భక్తుల కోలాటాలు, మంగళవాయిద్యాల సప్తస్వరాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మారుమోగాయి.

కుటుంబ శ్రేయస్సుకు ప్రతీక - చిన్నశేష వాహనం

వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పరమాత్మను 'శేషి'గా, ఈ సృష్టిలోని సర్వజీవరాశులను 'శేషభూతం'గా పరిగణిస్తారు. నాగరాజైన వాసుకిని ప్రతిబింబించే ఈ చిన్నశేష వాహనసేవ ద్వారా స్వామివారు శేషి భావాన్ని లోకానికి చాటిచెబుతున్నారు.

ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని… అలాగే యోగసాధకులకు కుండలినీ యోగసిద్ధి ఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

రాత్రి హంస వాహనసేవ….

మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానానికి ప్రతీక అయిన హంస వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. ఈ వాహనసేవ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యులు, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణతో పాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More