తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. నేటి నుంచి వాహనసేవలు ప్రారంభమయ్యాయి.

Published on: Nov 17, 2025, 10:12:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహించారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేపట్టారు. మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యహవచనం అంటారు. సభాపూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రణామం సమర్పించి అనుజ్ఞ తీసుకున్నారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని రుత్విక్‌వరణంలో వివరించారు.

అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీభూవరాహస్వామివారిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేశారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాషాచోప(మినుముల అన్నం) బలిహరణ చేశారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్రసమర్పణగావించారు.

భూమాత ఉద్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వచ్చారు. యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహించారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపునీళ్లు చల్లి బీజవాపనం చేపట్టారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు మెుదలయ్యాయి.

వాహనసేవల వివరాలు :

17-11-2025 : ఉద‌యం – ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం), రాత్రి – చిన్నశేషవాహనం

18-11-2025 : ఉద‌యం – పెద్దశేషవాహనం, రాత్రి – హంసవాహనం

19-11-2025: ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం, రాత్రి – సింహవాహనం

20 -11-2025 : ఉద‌యం – కల్పవృక్ష వాహనం, రాత్రి – హనుమంత వాహనం

21 -11-2025 : ఉద‌యం – పల్లకీ ఉత్సవం, రాత్రి – గజవాహనం

22-11-2025 : ఉద‌యం – సర్వభూపాలవాహనం, స‌మ‌యం – స్వర్ణరథం, రాత్రి – గరుడవాహనం

23-11-2025 : ఉద‌యం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం

24-11-2025 : ఉద‌యం – రథోత్సవం, రాత్రి – అశ్వ వాహనం

25-11-2025 : ఉద‌యం – పంచమీతీర్థం, రాత్రి – ధ్వజావరోహణం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More