...
...
Next Story

వరాహ నదిలో విషాదం - గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం

అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆదివారం ఉదయం వారి మృతదేహాలను బయటకు తీశారు.

Published on: Nov 15, 2026, 13:50:51 IST
Advertisement

అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు సమీపంలోని వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం నదిలో తేలియాడుతున్న వారి మృతదేహాలను స్థానికులు, పోలీసులు కలిసి బయటకు వెలికితీశారు. అప్పటివరకు తమ బిడ్డలు క్షేమంగా తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విగతజీవులుగా మారిన యువకులను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో పెనుగొల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఏం జరిగిందంటే….?

వరాహ నదిలో విషాదం (Image Source Pixel)
వరాహ నదిలో విషాదం (Image Source Pixel)

శనివారం ఆరుగురు యువకులు సరదాగా స్నానం చేసేందుకు పెనుగొల్లు వద్ద ఉన్న వరాహ నదిలోకి దిగారు. అయితే నదిలో నీటి ప్రవాహం, లోతు అంచనా వేయలేక వారు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆరుగురిలో ముగ్గురు యువకులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. కానీ కాతేటి రిషి (18), ముప్పిడి నాగవంశీ (22), కోడి జగదీశ్ (20) నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు వెతికినా వారి ఆచూకీ లభించలేదు.

ఆదివారం(ఇవాళ) తెల్లవారుజామున మళ్లీ గాలింపు ప్రారంభించగా…. ముగ్గురు యువకుల మృతదేహాలు నదిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానిక మత్స్యకారులు, పోలీసుల సాయంతో మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. చేతికి అందివచ్చిన యువకులు ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు…. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు యువకుల మృతితో ఆయా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక పరిహారం అందించాలని కాలనీవాసులు అధికారులను కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks